Credit Card Hack | సైబర్‌మోసగాళ్లు తన బ్యాంకు ఖాతా వివరాలు హ్యాక్చేశారని, తన ఎస్బీఐ క్రెడిట్ కార్డు నుంచి సుమారు రూ.52,500 (641డాలర్లు) డ్రా చేశారని 39 ఏండ్ల దక్షిణ ముంబై వ్యాపారవేత్త ఎల్టీమార్గ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన ఎస్బీఐ క్రెడిట్ కార్డుపై ట్రాన్సాక్షన్ జరిగినట్లు మెసేజ్ రాగానే ఎస్బీఐ అధికారులకు సంప్రదించి తన కార్డ్ బ్లాక్ చేయాలని కోరినట్లు తెలిపాడు. ఆ తర్వాత కూడా మరో 588 డాలర్ల ట్రాన్సాక్షన్ కోసం అలర్ట్ వచ్చినా.. కార్డ్ బ్లాక్ చేయడంతో లావాదేవీ ప్రాసెసింగ్ కాలేదన్నాడు. వ్యాపారవేత్త ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
`నేను ఎవరికి ఓటీపీ షేర్ చేయలేదు. ఏ లింక్ క్లిక్ చేయలేదు. నా బ్యాంకు ఖాతా వివరాలు సైబర్ మోసగాళ్లు హ్యాక్ చేసి, పాస్వర్డ్, ఓటీపీ లేకుండానే ట్రాన్సాక్షన్లు చేశారని నా అనుమానం` అని ఫిర్యాది దారు తెలిపాడు. ఖాతా వివరాలు షేర్ చేయకుండా అనధికారిక లావాదేవీలు జరిగే అవకాశం లేదని ఎల్టీమార్గ్ పోలీసులు అభిప్రాయ పడుతున్నారు. దీనిపై తదుపరి దర్యాప్తు కోసం బ్యాంకు అధికారుల నుంచి సమాచారం సేకరిస్తున్నారు.
ఇంటర్నేషనల్ వెబ్సైట్ల ద్వారా ఎలక్ట్రానిక్ వస్తువుల కొనుగోలు చేయడానికి సైబర్ మోసగాళ్లు క్రెడిట్ కార్డు వివరాలు వాడుతున్నారని పోలీసుల విచారణలో తేలింది. విదేశీ వెబ్సైట్ల నుంచి ట్రాన్సాక్షన్ల వివరాలు సేకరించడం తమకు సవాల్‌గా మారిందని పోలీసులు చెప్పారు. ముంబై నగరంలో ఇటువంటి అంశాలపై ఫిర్యాదులు వస్తున్నాయని ఓ పోలీస్ అధికారి ఒకరు తెలిపారు. క్రెడిట్ కార్డు లావాదేవీలకు ట్రాన్సాక్షన్స్ ఐడీ జనరేట్ చేయడానికి 10-15 రోజులు పడుతుందన్నారు. యూఎస్ వెబ్సైట్ ఫిలిప్స్ (ఫిలిప్స్ డాట్ కామ్) నుంచి ఒక సైబర్ మోసగాడు కొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులు కొనుగోలు చేశాడని, ఈ వెబ్సైట్ సర్వర్ అమెరికాలో ఉందని, దాని వివరాలు సేకరించడానికి, తదుపరి దర్యాప్తు కొనసాగించడానికి తమకు చాలా కష్టంగా మారిందన్నారు.
ఇటువంటి సైబర్ మోసాలను నిరోధించేందుకు బ్యాంకు అధికారులు తమకు సహకరించాలని, ఈ తరహా మోసపూరిత లావాదేవీల వివరాలను వెంటనే తమకు తెలియజేయాలని పోలీసులు కోరుతున్నారు. సైబర్ మోసాల విషయమై సకాలంలో తమను సహకరించాలని కోరుతూ బ్యాంకు అధికారులతో ముంబై జాయింట్ పోలీస్ కమిషనర్ (క్రైం) సత్య నారాయణ్ చౌదరి, అదనపు కమిషనర్ (సౌత్ రీజియన్) దిలీప్ సావంత్ సమావేశమయ్యారు.