పెట్టుబడులకు దిగేముందు ప్రతీ మదుపరికి ఎక్కడ తన సొమ్ముకు ఆకర్షణీయ ప్రతిఫలం లభిస్తుంది?.. అన్నదానిపైనే ధ్యాస ఉంటుంది.
అవగాహన లేకుండా చేసే మదుపు.. నష్టాలకు దారితీసే ప్రమాదం ఉంటుంది. కాబట్టి కొత్తగా పెట్టుబడులకు దిగేవారు వివేకంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం.
మార్కెట్లో పెట్టుబడుల కోసం రకరకాల సాధనాలున్నాయి. అయితే ఇందులో ఏది మనకు అనువైనదో ఎంచుకుని ముందుకెళ్తేనే లాభదాయకం. అలాంటి వాటిలో మల్టీక్యాప్, ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ గురించి తెలుసుకుందాం.
మల్టీక్యాప్.. ఫ్లెక్సీక్యాప్.. మ్యూచువల్ ఫండ్ (ఎంఎఫ్) ఇన్వెస్టర్లకు ఈ రెండు పదాలు చాలా సుపరిచితమే. అయితే మదుపు చేయాల్సి వచ్చినప్పుడు ఎందులో పెట్టుబడి పెట్టాలన్న ప్రశ్న సహజం. ఈ రెండు స్కీములనూ డైవర్సిఫైడ్ ఫండ్స్‌గా పరిగణిస్తాం. కానీ మదుపు చేసేటప్పుడు ఎంపిక చేసుకునే షేర్ల మార్కెట్ క్యాపిటలైజేషన్లో మాత్రం తేడాలుంటాయి.
రెండింటిలో ఏది ఉత్తమం?
వీటిలో మదుపు చేయాలన్న నిర్ణయానికి ముందే మీ పోర్టుఫోలియోను ఓసారి సమీక్షించండి. ఒకవేళ మీ పోర్టుఫోలియోలో స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ ఫండ్లు ఉంటే.. మల్టీక్యాప్ ఫండ్లలో మదుపు చేయడం ఉత్తమం. అలాగే మార్కెట్ క్యాప్ ఆధారంగా విచక్షణతో మదుపు చేయాలనుకుంటే కూడా మల్టీక్యాప్ ఫండ్స్‌లోనే మదుపు చేయండి. కానీ మార్కెట్‌తో సంబంధం లేకుండా కేవలం అవకాశాలకు అనుగుణంగా మదుపు చేసే ఫండ్ కావాలనుకుంటే ఫ్లెక్సీక్యాప్ ఫండ్‌లో మదుపు చేయవచ్చు. ఇక్కడ ఫండ్ మేనేజర్ సామర్థ్యం మీద నమ్మకం, అలాగే గతంలో స్కీమ్ ఇచ్చిన రాబడుల ఆధారంగా మదుపు నిర్ణయాన్ని తీసుకోండి.
రాబడులే గీటురాయి
వివిధ కాలాల్లో స్కీమ్ ఇచ్చిన రాబడులను అంచనా వేయండి. మీరు దీర్ఘకాల ఇన్వెస్టర్ అయితే ఏడాది నుంచి గత ఐదేండ్ల కాలంలో స్కీమ్ ఇచ్చిన రాబడులను పరిశీలించండి. ఏ స్కీమ్కైనా పనీతీరే గీటురాయి. కొన్ని ఫ్లెక్సీక్యాప్ ఫండ్లు గ్లోబల్ మార్కెట్లో కూడా మదుపు చేస్తున్నాయి. అన్నిటికన్నా ముఖ్యంగా మీరు ఎంచుకున్న స్కీమ్ మీ పోర్టుఫోలియోలో ఇమడగలదా?.. లేదా?.. అన్నది విశ్లేషించి నిర్ణయాన్ని తీసుకోండి.
పెట్టుబడులకు ఏ ఫండ్ ఉత్తమం?
మల్టీక్యాప్
మల్టీక్యాప్ ఫండ్స్ కనీసం 25 శాతం స్మాల్‌క్యాప్ షేర్లకు, 25 శాతం మిడ్‌క్యాప్ షేర్లకు, 25 శాతం లార్జ్‌క్యాప్ షేర్లకు నిధులను కేటాయిస్తాయి. కొన్ని సందర్భాల్లో లార్జ్‌క్యాప్ షేర్లలోనే 50 శాతం వరకు మదుపు చేసే వీలుంటుంది. మల్టీక్యాప్ ఫండ్స్ తప్పనిసరిగా 25:25:25 నియమాన్ని పాటించాలి. మిగిలిన 25 శాతం నిధులను మార్కెట్లో అందుబాటులో ఉన్న అవకాశాలకు అనుగుణంగా మదుపు చేయాల్సి ఉంటుంది. మార్చి నెలాఖరు వరకు అందుబాటులో ఉన్న డాటా ప్రకారం మల్టీక్యాప్ ఫండ్లు 42.36 శాతం నిధులను లార్జ్‌క్యాప్ షేర్లకు కేటాయించాయి.
ఫ్లెక్సీక్యాప్
ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మేనేజర్ ఏ మార్కెట్ క్యాప్ షేర్లలోనైనా మదుపు చేయవచ్చు. మార్కెట్ అవకాశాలకు అనుగుణంగా డైనమిక్‌గా స్విచ్ చేసుకునే వీలుంటుంది. అయితే ఫ్లెక్సీక్యాప్ ఫండ్స్ పెద్ద మొత్తాన్ని స్మాల్‌క్యాప్ షేర్లలోనే మదుపు చేస్తే.. మార్కెట్ పతనంలో ఫండ్ పనితీరుపై ప్రభావం పడుతుంది. అందుకని ఫ్లెక్సీక్యాప్ ఫండ్ మేనేజర్ కూడా బ్యాలన్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. మార్చి 31 వరకు అందుబాటులో ఉన్న డాటా ప్రకారం ఫ్లెక్సీక్యాప్ ఫండ్లు 68.7 శాతం నిధులను లార్జ్‌క్యాప్ షేర్లకు కేటాయించాయి.