న్యూఢిల్లీ, ఏప్రిల్ 5: మళ్లీ ముకేశ్ అంబానీయే దేశంలో అత్యంత సంపన్నుడిగా నిలిచారు. ఈ ఏడాదికిగాను మంగళవారం విడుదలైన ఫోర్బ్స్ బిలియనీర్ల జాబితాలో 90.7 బిలియన్ డాలర్లతో అగ్రస్థానంలో ఉన్నారు. 90 బిలియన్ డాలర్లతో రెండో స్థానంలో గౌతమ్ అదానీ ఉండగా.. అంబానీ, అదానీల మధ్య నువ్వా-నేనా అన్నట్లుగా సంపద పోరు గతకొంత కాలంగా సాగుతున్న విషయం తెలిసిందే. ఏటేటా అంబానీకి సమీపిస్తున్న అదానీ.. ఈసారి అధిగమించినంత పనేచేయడం విశేషం. ఇరువురి సంపద మధ్య 0.7 బిలియన్ డాలర్ల వ్యత్యాసామే ఉండటం ఇందుకు నిదర్శనం. ఇక ముకేశ్ అంబానీ ఆసియాలోనే అత్యంత సంపన్నుడిగా ఉండగా, ప్రపంచ టాప్-10 కుబేరుల్లో 10వ స్థానంలో ఉన్నారు. నిరుడుతో చూస్తే ముకేశ్ సంపద 7 శాతం పెరిగింది. డీ-మార్ట్ అధినేత రాధాకిషన్ దమానీ నిరుడు టాప్-100లోకి ప్రవేశించగా, ఈ ఏడాది టాప్-10 భారతీయుల్లో ఐదో స్థానంలో ఉన్నారు. మొత్తంగా 2021లో దేశవ్యాప్తంగా 140 మంది బిలియనీర్లుంటే.. ఈ ఏడాది166కు పెరిగారు.