Jio | ముంబై, ఆగస్టు 29: జియో వినియోగదారులకు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (ఆర్ఐఎల్) అధినేత ముకేశ్ అంబానీ బంపర్ ఆఫర్ ఇచ్చారు. ఏఐ క్లౌడ్ వెల్కమ్ ఆఫర్‌ను ప్రకటించారు. ఇందులోభాగంగా జియో యూజర్లు 100జీబీదాకా ఉచిత క్లౌడ్ స్టోరేజీని పొందే అవకాశాన్ని కల్పించారు. దీంతో జియో కస్టమర్లు తమ ఫోటోలను, వీడియోలను, డాక్యుమెంట్లను, డిజిటల్ కంటెంట్, ఇతర డాటాను స్వేచ్ఛగా, మరింత భద్రంగా దాచుకునే సౌలభ్యం లభించింది. రాబోయే దీపావళి నుంచి ఈ ఆఫర్ అందుబాటులోకి రానున్నది. దీంతో ఇక చాలా చౌక ధరలకే మార్కెట్లో క్లౌడ్ డాటా స్టోరేజీ, డాటా-పవర్డ్ ఏఐ సర్వీసులు అన్నిచోట్ల, అందరికీ దొరుకుతాయని అంబానీ అన్నారు. గురువారం ఇక్కడ జరిగిన కంపెనీ 47వ వార్షిక భాగస్వాముల సమావేశం (ఏజీఎం)లో ఈ మేరకు అన్ని వివరాలందించారు.
ఒక్కో మెట్టూ ఎక్కుతూ ఈ స్థాయికి వచ్చామని, దీని వెనుక ఎంతో కష్టం దాగి ఉన్నదని ముకేశ్ అంబానీ తమ సంస్థ ఎదుగుదలను వివరించారు. ఏజీఎంలో ఒకింత ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. రిలయన్స్ కింది స్థాయి నుంచి పైకొచ్చిందన్న ఆయన.. తమకు భారీ మూలాలేమీ లేవని చెప్పుకొచ్చారు. ఈ క్రమంలోనే మా సంపదను దాచుకోవట్లేదని, మరింత సంపదను సృష్టిస్తూ జాతి గర్వించదగ్గ కంపెనీగా రిలయన్స్‌ను తీర్చిదిద్దినట్టు పేర్కొన్నారు. బహుళ వ్యాపార, పారిశ్రామిక రంగాల్లో విస్తరించిన రిలయన్స్.. భారతీయ అత్యంత విలువైన కంపెనీగా నిలిచిన విషయం తెలిసిందే. ఆయిల్ రిఫైనింగ్, ఆయిల్-గ్యాస్ ఉత్పత్తి, పెట్రో కెమికల్స్, టెలికం, రిటైల్, మీడియా ఇలా దాదాపు అన్ని కీలక రంగాల్లో రిలయన్స్ కంపెనీలున్న సంగతీ విదితమే. కాగా, లాభాల కోసమో లేక సంపదను దాచుకోవడానికో తాము వ్యాపార కార్యకలాపాలను చేయడం లేదని ముకేశ్ అంబానీ అన్నారు. జాతి సంపద సృష్టికే పనిచేస్తున్నట్టు తెలిపారు. తర్వాతి తరాలకు రిలయన్స్‌ను గొప్ప సంపదగా అప్పజెప్తామన్నారు. ఉత్పత్తి, సేవల్లో అత్యంత నాణ్యతను పాటిస్తున్నామని, దేశ వినియోగదారుల జీవన ప్రమాణాలను పెంచుతున్నామని వెల్లడించారు.
భారత్‌కు ఎనర్జీ సెక్యూరిటీని కల్పించే బాధ్యతను రిలయన్స్ తీసుకున్నదని ముకేశ్ అంబానీ అన్నారు. ఈ క్రమంలోనే పునరుత్పాదక శక్తిపై దృష్టి సారించామని, సోలార్ పవర్ విస్తరణ దిశగా అడుగులు వేస్తున్నామని వివరించారు. ‘2018 జూలైలో 100 బిలియన్ డాలర్ల విలువను రిలయన్స్ చేరుకున్నది. 2022లో 250 బిలియన్ డాలర్లకు చేరింది. 2027 నాటికి ఇది రెట్టింపవుతుందని నేను వాగ్ధానం చేస్తున్నాను. భవిష్యత్తులో లాభాలపరంగా, వృద్ధిపరంగా రిలయన్స్ కొత్త శిఖరాలను అధిరోహించగలదు’ అని ముకేశ్ చెప్పారు.
ప్రపంచంలో ఇప్పుడు అతిపెద్ద మొబైల్ డాటా కంపెనీగా జియోనే ఉందని ముకేశ్ తెలియజేశారు. గడిచిన 8 ఏండ్లలో సంస్థ కస్టమర్లు 49 కోట్లకు పెరిగారని, సగటున నెలకు 30జీబీకిపైగా డాటా వాడుతున్నారని చెప్పా రు. ఇక ప్రపంచంలో అతిపెద్ద డాటా మార్కెట్‌గా భారతే ఉందన్న ఆయన.. ఇందుకు జియోనే కారణమన్నారు. అంతర్జాతీయ మొబైల్ ట్రాఫిక్‌లో జియో వాటా 8 శాతంగా ఉన్నట్టు వివరించారు. అలాగే 5జీ, 6జీ టెక్నాలజీల్లో జియోకు 350 పేటెంట్లున్నట్టు ఈ సందర్భంగా ముకేశ్ అంబానీ ప్రకటించారు. ఈ క్రమంలోనే ప్రతి నెలా 10 లక్షల బ్రాడ్‌బాండ్ కనెక్షన్లను లక్ష్యంగా చేసుకోబోతున్నట్టు తెలిపారు. అంతేగాక 2 కోట్లకుపైగా చిన్న-మధ్యతరహా వ్యాపారాలను, 15 లక్షల పాఠశాలలు-కళాశాలలను, 70వేలకుపైగా దవాఖానలను, 12 లక్షల డాక్టర్లను బ్రాడ్‌బాండ్‌తో కనెక్ట్ చేసే దిశగా వెళ్తున్నట్టు వెల్లడించారు.
తమ ఈక్విటీ షేర్హోల్డర్లకు 1:1 శ్రేణిలో బోనస్ షేర్లను ఇవ్వాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ భావిస్తున్నది. ఈ అంశాన్ని సంస్థ బోర్డు సెప్టెంబర్ 5న పరిశీలించనున్నది. ఈ మేరకు స్టాక్ ఎక్సేంజీలకు కంపెనీ తెలియజేసింది. కాగా, 2017 సెప్టెంబర్‌లో చివరిసారిగా బోనస్ షేర్లను జారీ చేసింది రిలయన్స్. మళ్లీ ఏడేండ్ల తర్వాత బోనస్ షేర్లను సిఫార్సు చేసే దిశగా కంపెనీ వెళ్తుండటం గమనార్హం. 2009లోనూ 1:1 ప్రాతిపదికన వాటాదారులకు బోనస్ షేర్లను రిలయన్స్ ఇండస్ట్రీస్ అందించిన సంగతి విదితమే.
వచ్చే 3-4 ఏండ్లలో రిటైల్ వ్యాపారాన్ని రెట్టింపు చేసే లక్ష్యంతో ముందుకెళ్తున్నట్టు రిలయన్స్ ప్రకటించింది. ఇందులో భాగంగానే లగ్జరీ జ్యుయెల్లరీ సెగ్మెంట్లోకి అడుగు పెట్టాలని యోచిస్తున్నట్టు రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ ఇషా అంబానీ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం (2023-24)లో రిలయన్స్ రిటైల్ రెవిన్యూ రూ.3 లక్షల కోట్ల మార్కును దాటినట్టు చెప్పారు. వచ్చే 4 ఏండ్లలో దీన్ని రూ.6 లక్షల కోట్లకు తీసుకెళ్తామన్న ఆశాభావాన్ని కనబర్చారు. రిటైల్ రంగంలో తమకు 30 కోట్లకుపైగా కస్టమర్లున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఇప్పటికే రిలయన్స్ రిటైల్ విలువ 100 బిలియన్ డాలర్లను దాటిన సంగతి తెలిసిందే.