BSNL-MTNL | కేంద్ర ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)లో మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్ఎల్)ను విలీనం చేసే విషయమై కేంద్రం పునరాలోచనలో పడినట్లు తెలుస్తోంది. బీఎస్ఎన్ఎల్లో ఎంటీఎన్ఎల్ విలీనం పక్కన బెట్టి.. ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలను బీఎస్ఎన్ఎల్కు అప్పగించే యోచనలో కేంద్రం ఉందని అధికార వర్గాల కథనం. ఈ ప్రక్రియ పూర్తి కావడానికి నెల రోజులు పట్టొచ్చునని ఆ వర్గాల కథనం.
భారీగా అప్పుల్లో కూరుకున్న ఎంటీఎన్ఎల్ సంస్థను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయడం ఏమాత్రం సబబు కాదని కేంద్రం భావిస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కనుక బీఎస్ఎన్ఎల్కు ఎంటీఎన్ఎల్ కార్యకలాపాల అప్పగింతపై కేంద్ర ప్రభుత్వ శాఖల కార్యదర్శుల కమిటీ నిర్ణయం తీసుకున్న తర్వాత కేంద్ర క్యాబినెట్ ఆమోదానికి పంపుతారని తెలుస్తోంది.
దేశ రాజధాని ఢిల్లీతోపాటు ముంబై నగరాల్లో మాత్రమే ఎంటీఎన్ఎల్ కార్యకలాపాలు సాగుతున్నాయి. మిగతా దేశమంతటా బీఎస్ఎన్ఎల్ సేవలు అందిస్తున్నాయి. ఈ నేపథ్యంలో భారీగా అప్పుల్లో కూరుకుపోయిన ఎంటీఎన్ఎల్.. ఈ నెల 20 నాటికి బాండ్ల హోల్డర్లకు వడ్డీ చెల్లింపులకు నిధుల్లేక అల్లాడిపోతున్నది. గత ఆర్థిక సంవత్సరం మార్చి త్రైమాసికంలో ఎంటీఎన్ఎల్ సంస్థకు 46 లక్షల మంది కస్టమర్లు ఉంటే.. ప్రస్తుతం అది 41 లక్షలకు పడిపోయింది. ఎంటీఎన్ఎల్ నష్టాలు రూ.2,915 కోట్ల నుంచి రూ.3,267 కోట్లకు పెరిగితే, ఆదాయం 14.6 శాతం పతనమై రూ.798.56 కోట్లకు పడిపోయింది.