న్యూఢిల్లీ, ఫిబ్రవరి 9: కార్పొరేట్ మోసాల ఆరోపణల్ని ఎదుర్కొంటున్న బిలియనీర్ వాణిజ్యవేత్త గౌతమ్ అదానీ గ్రూప్‌కు మరో గట్టి దెబ్బ తగిలింది. అదానీ కంపెనీలను అమెరికా ఇండెక్స్ ప్రొవైడర్ ఎస్ అండ్ పీ డోజోన్స్ సైస్టెన్‌బిలిటీ సూచీల నుంచి బయటకు పంపించిన రెండు రోజులకే పలు అంతర్జాతీయ ఇన్వెస్టర్లు ట్రాక్‌చేసే మోర్గా న్ స్టాన్లీ క్యాపిటల్ ఇంటర్నేషనల్ (ఎంఎస్సీఐ) సూచీలనుంచి వైదొలిగే ప్రమాదం ఏర్పడింది. లేదా కొన్ని అదానీ గ్రూప్ కంపెనీల వెయిటేజీని తగ్గించే అవకాశం ఉంది. అమెరికా హెడ్జ్ ఫండ్ హిండెన్‌బర్గ్ రీసెర్చ్ చేసిన ఆరోపణల నేపథ్యంలో కొంతమంది ఇన్వెస్టర్లు లేవనెత్తిన అంశాల దృష్ట్యా తమ ఎంఎస్సీఐ గ్లోబల్ ఇన్వెస్ట్బుల్ ఇండెక్స్‌ల్లో అదానీ కంపెనీల ఫ్రీఫ్లోట్లో మార్పులు చేయాల్సిన అవసరం ఏర్పడిందని, ఈ మార్పులపై తమ సమీక్షలో నిర్ణయం తీసుకుంటామని గురువారం ఎంఎస్సీఐ తెలిపింది.
విదేశీ ఫండ్స్, హెడ్జ్ ఫండ్స్, సావరిన్ వెల్త్ ఫండ్స్, ఇండెక్స్ ఫండ్స్..ఇలా పలు ఇన్వెస్టింగ్ సంస్థలు ఎంఎస్సీఐ ఇండెక్స్ల్ని ట్రాక్ చేస్తూ, ఆ సూచీల్లో ఆయా కంపెనీలకు ఉన్న వెయిటేజీ ప్రకారం నిధుల్ని పెట్టుబడి పెట్టడం లేదా ఉపసంహరించుకోవడం చేస్తుంటాయి. పబ్లిక్ కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉన్న షేర్లను ఫ్రీఫ్లోట్గా వ్యవహరిస్తారు. అంతర్జాతీయ ఇన్వెస్టర్లు వారి పెట్టుబడిలో ఏ కంపెనీకి ఎంత కేటాయించవచ్చన్న అంశాన్ని ఎంఎస్సీఐ ఫ్రీఫ్లోట్కు ఒక వెయిటేజీ ఇవ్వడం ద్వారా నిర్థారిస్తుంది. ఉదాహరణకు అదానీ ఎంటర్ప్రైజెస్ ఫ్రీఫ్లోట్‌ను ఎంఎస్సీఐ 25 శాతం తగ్గిస్తే, ఆ కంపెనీలో ప్రస్తుతం అంతర్జాతీయ ఇన్వెస్టర్లకు ఉన్న 430 మిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో 110 మిలియన్ డాలర్ల మేర విక్రయించి, వెయిటేజీ పెరిగిన కంపెనీలోకి మళ్లించుకుంటారు. 2022 నవంబర్ 30న ఆరు భారత్ షేర్లను ఎంఎస్సీఐ గ్లోబల్ స్టాండర్డ్ ఇండెక్స్‌లో చేర్చడంతో ఆ షేర్లలోకి రూ.9,010 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయి.
ఎంఎస్సీఐ ప్రకటనతో గురువారం అదానీ గ్రూప్ షేర్లు పతనబాట పట్టాయి. గ్రూప్ ఫ్లాగ్షిప్ కంపెనీ అదానీ ఎంటర్ప్రైజెస్ ఇంట్రాడేలో 20 శాతం వరకూ క్షీణించిన తర్వాత షార్ట్ కవరింగ్ ప్రభావంతో కొంత మేర నష్టాల్ని తగ్గించుకున్నప్పటికీ, చివరకు 11 శాతం క్షీణతతో రూ.1,914 వద్ద ముగిసింది. అదానీ ట్రాన్స్మిషన్, అదానీ టోటల్ గ్యాస్, అదానీ పవర్లు 5 శాతం చొప్పున పడిపోయాయి. అదానీ పోర్ట్స్ 3 శాతం నష్టపోయింది. ప్రస్తుతం అదానీ కంపెనీలన్నింటికీ కలిపి ఎంఎస్సీఐ ఇండెక్స్‌ల్లో 5.75 వెయిటేజీ ఉంది. వెయిటేజీని తగ్గిస్తే 1.5 బిలియన్ డాలర్ల వరకూ (రూ.12,000 కోట్లు) ఈ షేర్ల నుంచి తరలివెళతాయని ఒక రీసెర్చ్ సంస్థ తెలిపింది.
సెబీ నిబంధనల ప్రకారం లిస్టెడ్ కంపెనీల్లో ప్రమోటర్ల వాటా 75 శాతానికి మించకూడదు. మిగిలిన 25 శాతం వాటాను పబ్లిక్ షేర్ల ట్రేడింగ్ కోసం వదిలివేయాలి. దీనినే ఫ్రీఫ్లోట్ వాటాగా వ్యవహరిస్తారు. అయితే అదానీ గ్రూప్ కంపెనీల 25 శాతం ఫ్రీఫ్లోట్ షేర్లలోకి నిధులు వాస్తవ ఫండ్స్ నుంచి రాలేదని, బోగస్ సంస్థలు పెట్టుబడి చేశాయంటూ హిండెన్‌బర్గ్ రిపోర్ట్‌లో ఆరోపించడంతో ఎంఎస్సీఐ స్క్రూటినీ కిందకు అదానీ షేర్లు వచ్చాయని ఒక దేశీ ఫండ్ మేనేజర్ వివరించారు. ఎంఎస్సీఐ ప్రకటనపై హిండెన్‌బర్గ్ రీసెర్చ్ వ్యవస్థాపకుడు నాథన్ ఆండర్సన్ స్పందిస్తూ అదానీ కంపెనీల్లోకి విదేశాల్లో నెలకొన్న డొల్ల కంపెనీల నుంచి పెట్టుబడులు వస్తున్నాయంటూ తాము చేసిన ఆరోపణల్ని ఎంఎస్సీఐ తాజా ప్రకటన ధృవపరుస్తున్నదన్నారు.