Mother Dairy | ప్రముఖ పాల ఉత్పత్తుల సంస్థ మదర్ డెయిరీ మళ్లీ పాల ధరలు పెంచేసింది. ఫుల్ క్రీమ్ లీటర్ పాలపై రూపాయి, టోకెన్ మిల్క్ లీటర్‌పై రూ.2 ధర పెంచుతున్నట్లు తెలిపింది. ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్సీఆర్) పరిధిలో సోమవారం నుంచి పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయి. ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో పాల ధరలు పెంచక తప్పలేదని మదర్ డెయిరీ పేర్కొంది. ఈ ఏడాది మదర్ డెయిరీ పాల ధరలు పెంచడం ఇది నాలుగోసారి. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో ప్రతి రోజూ 30 లక్షల లీటర్లకు పైగా పాలను సరఫరా చేస్తుంది. దీని ప్రకారం ఫుల్ క్రీమ్ పాలు లీటర్ ధర రూపాయి పెరిగి రూ.64లకు చేరుకుంది.
అయితే 500 మిల్లీ లీటర్ల ఫుల్ క్రీమ్ ప్యాక్ పాల ధరను మాత్రం పెంచలేదు. టోకెన్ మిల్క్ (బల్క్ వెండెడ్ మిల్క్) లీటర్ ధర రూ.2 పెరిగి రూ.48 నుంచి రూ.50కి చేరుకుంది. ఇప్పటికే ఆహార ద్రవ్యోల్బణం రికార్డు స్థాయిలో పెరిగిపోయిన నేపథ్యంలో పాల ధర పెంపుతో వంటింటి బడ్జెట్ మరింత భారం కానున్నది. డెయిరీ రైతుల నుంచి పాల సేకరణ ఖర్చులు పెరగడం వల్లే పాల ధరలు పెంచాల్సి వచ్చిందని మదర్ డెయిరీ అధికార ప్రతినిధి చెప్పారు. పశుగ్రాసం, దాణా వంటి ఉత్పత్తుల ధరలు పెరిగిపోవడంతో పాల ధర కూడా పెరిగిందని డెయిరీ ప్రతినిధులు చెబుతున్నారు.
పాల ఉత్పత్తుల డిమాండ్‌కు సరఫరా మధ్య గ్యాప్ చాలా ఎక్కువగా ఉందని మదర్ డెయిరీ అధికార ప్రతినిధి తెలిపారు. డిమాండ్‌కు తగినట్లు పాల సరఫరా జరుగడం లేదు. ఫెస్టివ్ సీజన్ తర్వాత తలెత్తిన పరిణామాలతో పాల ధరలు పెంచక తప్పడం లేదని మదర్ డెయిరీ వెల్లడించింది. పాల ఉత్పత్తికి అయ్యే ఖర్చుల్లో 75-80 భారం వినియోగదారులపైనే మదర్ డెయిరీ మోపుతుంది. ఇంతకుముందు మదర్ డెయిరీ గత నెల 16న ఫుల్ క్రీమ్ మిల్క్, గోవు పాలు లీటర్‌కు రూ.2 పెంచేసింది. మార్చి, ఆగస్టు నెలల్లో రూ.2 చొప్పున మదర్ డెయిరీ ధరలు పెంచివేసింది.