Morgan Stanley | ప్రముఖ ఫైనాన్సియల్ సర్వీసెస్ సంస్థ మోర్గాన్ స్టాన్లీ.. తమ సీఈవో జేమ్స్ గోర్మన్కు షాక్ ఇచ్చింది. గతేడాది వేతనం, కాంపన్సేషన్లో 10 శాతం కోత విధించింది. 2022లో సంస్థ షేర్లు పతనం కావడంతోపాటు లాభాలు పడిపోయాయి. ఈ నేపథ్యంలో ఆయన వేతన ప్యాకేజీలో 31.5 మిలియన్ల డాలర్ల కోత విధించినట్లు మోర్గాన్ స్టాన్లీ తెలిపింది. ఈ ప్యాకేజీలో వేతనం 1.5 మిలియన్ల డాలర్లు, 7.5 మిలియన్ల డాలర్ల క్యాష్ బోనస్ కూడా ఉన్నాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో వెల్లడించింది.
తమ సీఈవో జేమ్స్ గోర్మన్ అసాధారణ వ్యక్తిగత పనితీరు కల ఎగ్జిక్యూటివ్ అని మోర్గాన్ స్టాన్లీ పేర్కొంది. ఆయన శక్తియుక్తులపైనే తమ సంస్థ నాయకత్వ వ్యూహం, సంస్కృతి, కీలక విలువలు, సంస్థ ఆర్థిక పనితీరు (పెర్ఫార్మెన్స్) ఆధార పడి ఉన్నాయని తెలిపింది. కానీ, ప్రస్తుత అనిశ్చిత ఆర్థిక పరిస్థితుల్లో 2022లో సంస్థ శక్తిమంతమైన పనితీరు ప్రదర్శించలేకపోయిందని వెల్లడించింది. ఇదిలా ఉంటే 2021లో అత్యధిక లాభాలు రావడంతో 2021లో జేమ్స్ గోర్మన్కు ఆరు శాతం వేతన ప్యాకేజీ పెరిగింది. కానీ, 2022లో మోర్గాన్ స్టాన్లీ లాభాలు ఒక త్రైమాసికం ఫలితాల కంటే తక్కువగా నమోదయ్యాయి. షేర్లు 13 శాతానికి పైగా నష్టపోయాయి.