TCS | న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: రూ.10 లక్షలు, ఆపై విలువ కలిగిన హ్యాండ్‌బ్యాగులు, చేతి గడియారాలు, పాదరక్షలు, స్పోర్ట్స్‌వేర్ తదితర లగ్జరీ వస్తూత్పత్తుల కొనుగోళ్లపై ఇక నుంచి 1 శాతం ట్యాక్స్ కలెక్టెడ్ ఎట్ సోర్స్ (టీసీఎస్) వర్తిస్తుందని ఆదాయ పన్ను (ఐటీ) శాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు తాజాగా ఓ నోటిఫికేషన్‌ను ఐటీ శాఖ విడుదల చేసింది. ప్రస్తుతం రూ.10 లక్షలు, ఆపై విలువైన మోటర్ వాహనాలపై 1 శాతం టీసీఎస్ పడుతున్నది. ఈ ఏడాది జనవరి 1 నుంచే ఇది అమల్లోకి వచ్చింది. గత ఏడాది జూలైలో ప్రకటించిన బడ్జెట్లో భాగంగా వచ్చిన ఆర్థిక చట్టం-2024 ద్వారానే దీన్ని పరిచయం చేశారు. ఈ క్రమంలో ఇకపై మరికొన్ని ఖరీదైన ఐటెమ్స్పైనా సదరు టీసీఎస్ ఉంటుందంటున్నాయి ఐటీ శాఖ వర్గాలు.
ఏదైనా వస్తూత్పత్తిని అమ్మినప్పుడు దానికి సంబంధించిన చెల్లింపులు (బిల్ పేమెంట్) జరిగే సమయంలోనే కొనుగోలుదారుడి నుంచి అమ్మేవారు వసూలు చేసే ట్యాక్స్‌నే టీసీఎస్ అంటారు. అయితే కొన్నవారు ఈ పన్ను మొత్తాన్ని తమ ఐటీ రిటర్నులను దాఖలు చేసేటప్పుడు క్లెయిం చేసుకోవచ్చు. కాగా, అదనపు ఆదాయాన్ని ఆర్జించాలనే లక్ష్యంతో ఈ టీసీఎస్‌ను విధించట్లేదని, లగ్జరీ వస్తూత్పత్తులను కొనేటప్పుడు కొనుగోలుదారుడు సమర్పించే పాన్ (పర్మనెంట్ అకౌంట్ నెంబర్) వివరాలనుబట్టి ఈ లావాదేవీలను ఐటీ శాఖ గుర్తించడానికి టీసీఎస్ ఉపయోగపడుతుందని ట్యాక్స్ ఎక్స్పర్ట్స్ పేర్కొంటున్నారు. దీనివల్ల ఆర్థిక పారదర్శకతకు వీలుంటుందని చెప్తున్నారు.