న్యూఢిల్లీ, జనవరి 5: తెలంగాణతోపాటు ఢిల్లీ, కేరళ రాష్ట్రాలకు సంబంధించి ఈ-బస్సుల కోసం నిర్వహించిన టెండర్‌ను కేంద్ర ప్రభుత్వానికి చెందిన కన్వర్జెన్సీ ఎనర్జీ సర్వీసెస్ లిమిటెడ్(సీఈఎస్ఎల్) దక్కించుకున్నది. రూ.5 వేల కోట్ల విలువైన 4,675 ఈ-బస్సుల సరఫరాకు సంబంధించిన ఆర్డర్ లభించినట్లు పేర్కొంది. నేషనల్ ఎలక్ట్రిక్ బస్సు ప్రొగ్రాం(ఎన్‌ఈబీపీ) కింద రెండోసారి ఈ టెండర్లను నిర్వహించారు. చమురు దిగుమతిని నియంత్రించడానికి, కాలుష్య ఉద్గారాలను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఈవీల వాడకాన్ని ప్రోత్సహిస్తున్నది. డ్రై లీజు కింద ఈ మూడు రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన రాష్ట్ర రవాణా సదుపాయాల విభాగాల నుంచి ఈ ఆర్డర్ లభించినట్లు పేర్కొంది. దీంట్లో భాగంగా బస్సులను లీజుకు ఇవ్వనున్నది. డ్రైవర్ లేదా కండక్టర్లను ఆయా రవాణా సంస్థలు సమకూర్చుకోనున్నాయి. 10 నుంచి 12 ఏండ్లపాటు ఈ బస్సుల నిర్వహణ ఎస్టీసీ చూడనున్నది.