Bank Jobs | న్యూఢిల్లీ, ఆగస్టు 1: నానాటికీ పెరుగుతున్న సాంకేతిక పరిజ్ఞానం.. ఆర్థిక రంగంలో పెను మార్పులనే తెస్తున్నది. ముఖ్యంగా విస్తరిస్తున్న డిజిటలైజేషన్, ఆటోమేషన్ ప్రభావం దేశీయ బ్యాంకింగ్ రంగంపై స్పష్టంగా కనిపిస్తున్నది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున జరుగుతున్న కంప్యూటరీకరణతో బ్యాంకుల్లో మధ్య, దిగువ శ్రేణి క్లరికల్ ఉద్యోగాలు కనుమరుగైపోతున్నాయి. అవును.. 2010-11 ఆర్థిక సంవత్సరంలో బ్యాంకింగ్ రంగంలో అధికారులు, వారి సహాయక సిబ్బంది నడుమ నిష్పత్తి 50:50గా ఉన్నది. 2022-23 ఆర్థిక సంవత్సరం వచ్చేసరికి 74:26గా ఉండటంతో బ్యాంకుల్లో వేగంగా చోటుచేసుకుంటున్న మార్పులకు ఇది అద్దం పడుతున్నది. ఈ నేపథ్యంలో కృత్రిమ మేధస్సు (ఏఐ) రాకతో బ్యాంకుల్లో ఉద్యోగావకాశాలు మరింతగా సన్నగిల్లుతాయన్న ఆందోళనలు ఇప్పుడు అంతటా వ్యక్తమవుతున్నాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఇచ్చిన నివేదికలో 2013 నుంచి 2019 వరకు అంతర్జాతీయంగా ఆర్థిక రంగంలో సహాయక సిబ్బంది సంఖ్య తగ్గిపోయినట్టు తేలింది. ఇదే సమయంలో నిపుణులు, సాంకేతిక సిబ్బంది సంఖ్య పెరిగినట్టు కనిపించడం గమనార్హం. భారత్‌లోనూ ఇదే పరిస్థితి. మరోవైపు 2022-23 ఆర్థిక సంవత్సరంలో ప్రైవేట్ బ్యాంకుల టర్నోవర్ రేటు 30 శాతం పెరిగింది. డిజిటల్ వేదికల ద్వారా చేపట్టిన నియామకాలే ఇందుకు కారణమని ఆర్బీఐ రిపోర్ట్ చెప్పడం విశేషం. ‘దేశీయ లేబర్ మార్కెట్లో ఏఐ ఆధారిత నైపుణ్యాల ప్రాముఖ్యత పెరిగింది. గత ఏడాది జరిగిన మొత్తం నియామకాల్లో ఏఐ ప్రతిభ కలిగినవారి వాటా 16.8 శాతంగా ఉండటమే దీనికి నిదర్శనం. మునుపెన్నడూ ఈ స్థాయిలో లేదిది’ అని ఆర్బీఐ నివేదిక చెప్పింది.
దేశంలో డిజిటల్ విప్లవం వేగంగా జరుగుతున్నది. ఈ క్రమంలోనే 2026కల్లా భారత జీడీపీలో డిజిటల్ ఎకానమీ వాటా 20 శాతానికి చేరగలదన్న అంచనాలున్నాయి. ఇప్పుడు 10 శాతంగానే ఉన్నదిది. తర్వాతితరం బ్యాంకింగ్, మెరుగైన ఆర్థిక సేవలను తక్కువ ఖర్చుతోనే అందించడానికి డిజిటలైజేషన్ దోహదం చేస్తున్నదని ఆర్బీఐ గవర్నర్ దాస్ అంటున్నారు. అయితే ఉద్యోగ వ్యవస్థను కాపాడుకోవడం కూడా ముఖ్యమేనన్న అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు బ్యాంకుల్లో ఎక్కడ చూసినా డిజిటల్ సేవలు కనిపిస్తున్నాయి. నగదు డిపాజిట్లు, విత్‌డ్రాలు ఉద్యోగుల ప్రమేయం లేకుండానే జరిగిపోతున్నాయి. గూగుల్ పే, ఫోన్‌పే వంటి పేమెంట్స్ యాప్‌లు వచ్చాక చాలామంది బ్యాంకులకు వెళ్లడం మానేశారు. పాస్‌బుక్ ప్రింటింగ్లూ కియోస్క్‌ల ద్వారా జరిగిపోతున్నాయి. దీంతో ఒకప్పుడు ఈ పనుల నిర్వహణకు అవసరమైన సిబ్బంది.. నేడు అక్కర్లేకుండాపోయారు.
టెక్నాలజీతో ఎంతైతే మంచి జరుగుతున్నదో.. దాన్ని ఆసరాగా చేసుకుని సైబర్ మోసగాళ్లూ అంతే చెడుకు పాల్పడుతుండటం ఆందోళన కలిగిస్తున్నది. పెరుగుతున్న సైబర్ మోసాలపట్ల అప్రమత్తంగా ఉండాలని ఆర్బీఐ అటు బ్యాంకింగ్, బ్యాంకింగేతర ఆర్థిక సంస్థలను.. ఇటు ఖాతాదారులను ఎప్పటికప్పుడు హెచ్చరిస్తున్నది చూస్తూనే ఉన్నాం. 2019-20 నుంచి 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో డాటా చౌర్యం విలువ 28 శాతం ఎగిసి 2 మిలియన్ డాలర్లకు చేరినట్టు చెప్తున్నారు. సైబర్ రిస్క్‌లు ముఖ్యంగా ఫిషింగ్ దాడులు పెరిగిపోయాయి. దీంతో ఖాతాదారుల విలువైన సమాచారం మోసగాళ్ల బారిన పడుతున్నది. అందుకే అనామక కాల్స్, మెసేజ్‌లకు స్పందించవద్దని, తెలియని లింక్స్‌పై క్లిక్ చేయవద్దని బ్యాంకులతోపాటు పోలీసులూ హెచ్చరిస్తున్నారు. అయినా అమాయకులు మోసపోతూనే ఉన్నారు.
ఆర్థిక రంగంలో శ్రామిక శక్తిని ఔట్సోర్సింగ్, టెలీవర్క్ ద్వారా డిజిటలైజేషన్ వికేంద్రీకరిస్తున్నది. ఉద్యోగుల స్థానంలో ఆటోమేషన్ వచ్చేస్తున్నది. దీనివల్ల జాబ్ మార్కెట్.. తక్కువ నైపుణ్యం ఉన్నవారికి తక్కువ వేతనం/ ఎక్కువ నైపుణ్యం ఉన్నవారికి ఎక్కువ వేతనం అన్నట్టుగా తయారైంది. ఇక మధ్యస్థాయి ఉద్యోగులనైతే టెక్నాలజీ భర్తీ చేసేస్తున్నది.
-శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్