Moonlighting @ IT | ప్రస్తుతం మూన్‌లైటింగ్ అనే విషయంపై ఐటీ రంగంలో విస్తృతంగా చర్చ జరుగుతున్నది. మూన్‌లైటింగ్ కారణంగా ఐటీ ప్రొఫెషనల్స్ ఆరోగ్యపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అపవాదు కూడా తెరపైకొచ్చింది. ఒక సంస్థలో పనిచేస్తూ ఎక్కువ సంపాదించేందుకు రాత్రి వేళ మరో సంస్థలో ఏకకాలంలో పనిచేయడాన్నే మూన్ లైటింగ్ అని చెప్తున్నారు. మూన్‌లైటింగ్‌పై ఐబీఎం ఎండీ సందీప్ పటేల్ కూడా తన అభిప్రాయాన్ని కుండబద్దలు కొట్టారు.
మూన్‌లైటింగ్‌పై అభ్యంతరం వ్యక్తం చేసిన ఐబీఎం సంస్థ.. అంతర్గత నోట్లో తమ ఉద్యోగులకు సంస్థ అభిప్రాయాన్ని స్పష్టం చేసింది. కంపెనీ అనుమతి లేకుండా ఉద్యోగులు ఎవరూ బయటి పని చేయకూడదని ఇంటర్నల్ నోట్లో ఐబీఎం మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ పటేల్ స్పష్టమైన నిషేధపుటాజ్ఞలు ఇచ్చారు. ఏక కాలంలో రెండో ఉద్యోగం చేయడం వలన మానసిక సంఘర్షణ ఎలా ఉంటుందనేది తన నోట్లో వివరించారు. ఈ కాన్సెప్ట్ చాలా గందరగోళాన్ని సృష్టిస్తున్నదని సందీప్ పాటిల్ అన్నారు. మూన్‌లైటింగ్ అనేది ఎంత మాత్రమూ నైతికం కాదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఒకవైపు ఐబీఎంలో పనిచేస్తూ మరోవైపు ఇంటి వద్ద చిన్న వ్యాపారం చేస్తున్నా అది ఐబీఎం అధికారిక విధులను ప్రభావితం చేస్తుందని సందీప్ పాటిల్ చెప్పారు. వారాంతాల్లో లేదా వ్యక్తిగత ఫ్రీ టైమ్‌లో మార్కెట్లో సంస్థ పోటీదారులతో కలిసి పనిచేయడం వల్ల తప్పు చేసిన వారవుతారన్నారు. ఉద్యోగంలో చేరేటప్పుడు ఒప్పందం చేసుకున్నట్లుగా ఐబీఎం సంస్థలోనే పనిచేయాల్సి ఉంటుందని, మూన్‌లైటింగ్‌కు పాల్పడటం వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా ఐబీఎం ప్రయోజనాలను పణంగా పెట్టడమే అవుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. దీనిని విశ్వాస ఉల్లంఘనగా సంస్థ పరిగణిస్తుందని ఉద్యోగులకు హెచ్చరించారు.