న్యూఢిల్లీ, ఆగస్టు 8: దేశ జీడీపీ వృద్ధిరేటు ఈ ఆర్థిక సంవత్సరం (2025-26) 6 శాతానికే పరిమితం కావచ్చని ప్రముఖ గ్లోబల్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ శుక్రవారం అంచనా వేసింది. అమెరికాలోకి దిగుమతయ్యే భారతీయ వస్తూత్పత్తులపై 50 శాతం సుంకాలు అమలైతే భారత ఆర్థిక వృద్ధిరేటు 30 బేసిస్ పాయింట్లు (0.3 శాతం) పడిపోయే ప్రమాదం ఉందన్నది. ఇదిలావుంటే వచ్చే ఏడాది ప్రపంచ వాణిజ్యం ట్రంప్ టారిఫ్‌లతో ప్రభావితం కాగలదని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యుటీవో) హెచ్చరించింది. ట్రేడ్ గ్రోత్ అంచనా మునుపు వేసినట్టుగా 2.5 శాతంగా ఉండదని, 1.8 శాతానికే పరిమితం కాగలదన్నది. అయితే ఈ ఏడాది వాణిజ్య వృద్ధి 0.9 శాతంగా ఉండొచ్చని పేర్కొన్నది. సుంకాల భయంతో ఆయా దేశాలు పెద్ద ఎత్తున దిగుమతులకు దిగుతుండటమే ఈ వృద్ధికి కారణమని చెప్పుకొచ్చింది.
మరోవైపు అమెరికాతోపాటు మరికొన్ని దేశాలతో వాణిజ్య ఒప్పందాలకు చర్చలు జరుపుతున్నామని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. కాగా, టారిఫ్ నిర్ణయాలు విఫలమయ్యాయని ట్రంప్‌కు వచ్చే 6-9 నెలల్లో అవగతమవుతుందని ప్రధాన మంత్రి ఆర్థిక సలహాదారు మండలి సభ్యుడు నీల్కాంత్ మిశ్రా అన్నారు. ఇక అమెరికాతో వాణిజ్య ఒప్పందం సందర్భంగా భారత్ ఎలాంటి ఒత్తిళ్లకు లోనుకావద్దని నీతి ఆయోగ్ మాజీ సీఈవో అమితాబ్ కాంత్ సూచించారు. యూరోపియన్ యూనియన్‌తో భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందానికి గట్టిగా ప్రయత్నించాలని 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అర్వింద్ పనగరియా సలహా ఇచ్చారు.