Atal Pension Yojana | అసంఘటిత రంగ కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అటల్ పెన్షన్ యోజన (ఏపీవై) ఎంతో ఉపయోగంగా ఉంటుంది. కేంద్ర ప్రభుత్వ స్పాన్షర్డ్ స్కీం కావడంతో బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతా గల ఏ భారతీయుడైనా పొందొచ్చు. 18-40 ఏండ్ల మధ్య వయస్సు గల వారెవరైనా అటల్ పెన్షన్ యోజన (ఏపీవై)లో చేరిన సభ్యులకు నెలవారీగా రూ.1000 నుంచి రూ.5000 పెన్షన్ అందుతుంది.
2017-18 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి ఏపీవైలో 97.05 లక్షల మంది సబ్స్క్రైబర్లు చేరారు. పెన్షన్ నియంత్రణ సంస్థ మాత్రం 2017-18 చివరికల్లా కోటి మంది సభ్యత్వం పొందుతారని భావించింది. సబ్స్క్రైబర్ల బేస్‌లో షార్ట్ కమింగ్స్ ఉన్నా.. అసంఘటిత రంగ కార్మికులకు పెన్షన్ పొందడానికి మంచి పథకంగా ఉంది.
మీకు 18 ఏండ్ల వయస్సు దాటిందా.. అయితే ప్రతి నెల రూ.42 నుంచి రూ.210 కంట్రిబ్యూషన్ జమ చేయొచ్చు. మీ వయస్సు ఎక్కువైనా కొద్దీ.. మీరు చెల్లించాల్సిన ప్రీమియం పెరుగుతుంది. వయస్సును బట్టి ఈ స్కీంలో చేరేందుకు అర్హత ఉంటుందా.. లేదా? అని తేల్చేయొచ్చు. ఒకవేళ మీరు సబ్‌స్క్రైబర్‌గా పేరు నమోదు చేసుకుంటే మాత్రం మీ సేవింగ్స్ ఖాతా నుంచి ఆటోమేటిక్‌గా డబ్బు డెబిట్ అవుతుంది.
ఆటో డెబిట్ ఫెసిలిటీ కూడా పూర్తిగా ఆప్షనల్‌గా ఉంటుంది. ఆ ఆప్షన్‌ను ఎంచుకుంటే వడ్డీ కూడా చెల్లించాల్సిందే. కనీసం 20 ఏండ్ల పాటు ఈ స్కీంలో కంట్రిబ్యూషన్ చేయాలి. నెలవారీగా, మూడు నెలలకోసారి, అర్ధ సంవత్సరానికి ఒకసారి ప్రీమియం చెల్లించాలి.
అటల్ పెన్షన్ యోజన స్కీం కింద కనీసం పెన్షన్ రూ.1000 నుంచి రూ.5000 వరకు పొందొచ్చు. సబ్‌స్క్రిప్షన్‌తోపాటు మీరు ఎంచుకునే కనీస పెన్షన్ బట్టి ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏండ్లు దాటిన తర్వాతే పెన్షన్ పొందుతారు. ముందస్తుగా స్కీం నుంచి బయటకు వెళ్లిపోయే ఆప్షన్ కూడా ఉంది. అయితే మరణం, అనారోగ్యానికి గురైతేనే ముందస్తుగా వెళ్లడానికి అనుమతినిస్తారు.
అటల్ పెన్షన్ యోజన స్కీం కింద కంట్రిబ్యూషన్స్ చేసిన వారు నేషనల్ పెన్షనల్ స్కీం (ఎన్పీఎస్) స్కీం మాదిరిగానే బెనిఫిట్లు పొందొచ్చు. ఆదాయం పన్ను (ఐటీ) చట్టంలోని 80సీసీడీ (1బీ) సెక్షన్ కింద ఈ కంట్రిబ్యూషన్లు నమోదు చేయొచ్చు. ఇప్పుడు రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఐటీ చట్టం 80సీ సెక్షన్ కింద రూ.1.5 లక్షల వరకు మినహాయింపు క్లయిమ్ చేయవచ్చు.
అసంఘటిత రంగ కార్మికులకు కనీస పెన్షన్ రూ.1000-5000 వస్తే నెలవారీ ఖర్చులకు గణనీయ సొమ్ము అవుతుంది. మిగతా పథకాలతో పోలిస్తే ఇది కనీస కంట్రిబ్యూషన్. అయితే, మీ పెట్టుబడులను బట్టి పెన్షన్ ఆధార పడి ఉంటుంది.