న్యూఢిల్లీ, డిసెంబర్ 16 : గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ (Green Credit Program) కింద అడవుల పెంపకం కోసం రిజర్వ్ చేసిన అటవీ భూములను సైతం అదానీ గ్రూపు (Adani Group) తమకు కావాలని డిమాండ్ చేయడంతో ఆ భూములకు విముక్తి చేయాలని బీజేపీ పాలిత గుజరాత్ ప్రభుత్వం.. కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. అయితే గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ని పర్యవేక్షించేందుకు కేంద్రం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ ఈ అభ్యర్థనపై వెనుకడుగు వేసింది. దట్టమైన అడవులను పెంచేందుకు రిజర్వ్ చేసిన అటవీ భూముల్లో చెట్ల నరికివేతకు అనుమతించడం ఈ కార్యక్రమ లక్ష్యానికే విరుద్ధమని నిపుణుల కమిటీ స్పష్టం చేసింది. దీంతో గుజరాత్ ప్రభుత్వం తమ వాదనను సమర్థించుకుంటూ మరో అభ్యర్థనను కేంద్రానికి పంపింది.
ఈ అటవీ భూములపై చెట్లు నాటడానికి ఎవరూ ఇష్టపడటం లేదని, గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ పరిధి నుంచి ఈ అటవీ భూములను తొలగించాలని రెండో అభ్యర్థనలో గుజరాత్ ప్రభుత్వం కోరింది. దీంతో కరిగిపోయిన కేంద్రం తన నిబంధనలను తానే అతిక్రమిస్తూ గుజరాత్ ప్రభుత్వ అభ్యర్థనకు మొగ్గుచూపింది. మొత్తం 63.44 హెక్టార్ల అటవీ భూమితోపాటు గ్రీన్ క్రెడిట్ ప్రోగ్రామ్ కోసం రిజర్వ్ చేసిన మొత్తం భూమిపైవున్న ఆంక్షలను ఎత్తివేసింది. 2023 అక్టోబర్లో ఎంతో ఆర్భాటంగా మోదీ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. దీనిపై రిపోర్టర్స్ కలెక్టివ్… గుజరాత్ ప్రభుత్వానికి ప్రశ్నలు సంధించగా అదానీ గ్రూపు కోసం కేంద్రానికి లేఖలేవీ రాయలేదని, ఆ వార్తలు అవాస్తవాలన్నది.