Mobile Users | దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య నిరంతరం తగ్గుతున్నది. గత రెండు నెలల్లో 54.77 లక్షల మంది మొబైల్ ఫోన్లకు దూరమయ్యారు. అయినప్పటికీ జియో సంస్థనే నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. రిలయన్స్, ఎయిర్టెల్కు కొత్త వినియోగదారులు పెరుగుతుండటం విశేషం. రెండో స్థానంలో ఎయిర్టెల్ కొనసాగుతున్నది. ఈ ఏడాది అక్టోబర్ నెలనాటికి దేశంలో మొబైల్ వినియోగదారుల సంఖ్య 114.36 కోట్లుగా ఉన్నది.
టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) తెలిపిన వివరాల ప్రకారం.. ఆగస్టు నెలలో దాదాపు 114.91 కోట్ల మంది మొబైల్ వినియోగదారులు ఉండగా.. సెప్టెంబర్ నెలలో ఈ సంఖ్య 36.64 లక్షలు తగ్గి 114.54 కోట్లకు చేరింది. ఇదే సమయంలో అక్టోబర్ నెలలో 18.13 లక్షల మంది మొబైల్ వినియోగదారులు తగ్గారు. కాగా, టెలికాం రంగంలో రిలయన్స్ జియో తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ నంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్నది. అక్టోబర్లో జియో నెట్వర్క్కు 14.14 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరారు. దీంతో జియో నెట్వర్క్ వినియోగదారుల సంఖ్య 42.13 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో అక్టోబర్లో భారతీ ఎయిర్టెల్కు 8.5 లక్షల మంది కొత్త వినియోగదారులు చేరడంతో.. ఎయిర్టెల్ సబ్స్క్రైబర్ల సంఖ్య 36.50 కోట్లకు పెరిగింది.
వొడాఫోన్ ఐడియా వినియోగదారుల సంఖ్య క్రమంగా క్షీణిస్తున్నది. వొడాఫోన్ ఐడియా కంపెనీకి చెందిన 35.09 లక్షల మంది వినియోగదారులు అక్టోబర్లో నెట్వర్క్ను వదులుకున్నారు. దాంతో కంపెనీ మొత్తం వినియోగదారుల సంఖ్య 24.56 కోట్లకు పడిపోయింది. కాగా, బీఎస్ఎన్ఎల్ వినియోగదారులు 5.92 లక్షల మంది తగ్గగా.. ప్రస్తుతం బీఎస్ఎన్ఎల్ వద్ద 10.86 లక్షల మంది వినియోగదారులున్నారు.