Mobile Exports | న్యూఢిల్లీ, మార్చి 7: పదేండ్ల క్రితం మొబైల్ దిగుమతి చేసుకునే స్థాయి నుంచి ఎగుమతి చేసుకునే స్థాయికి భారత్ ఎదిగింది. ఇదే క్రమంలో భవిష్యత్తులో భారత్ నుంచి 50-60 బిలియన్ డాలర్ల విలువైన మొబైల్ ఫోన్లు ఎగుమతి కానున్నాయని కేంద్ర ఐటీ, కమ్యూనికేషన్స్ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. గడిచిన సంవత్సరంలో 11 బిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు ఎగుమతి అయ్యాయి. బుధవారం జరిగిన ఫిన్టెక్ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..అలాగే ప్రస్తుతం ఎలక్ట్రానిక్స్ తయారీ రంగంలో 10 లక్షల మంది ఉపాధి పొందుతుండగా, భవిష్యత్తులో ఈ సంఖ్య 25 లక్షలకు చేరుకుంటుందని ఆశిస్తున్నట్లు చెప్పారు. పదేండ్ల క్రితం 98 శాతం మొబైల్ ఫోన్లు దిగుమతి చేసుకుంటుండగా..ప్రస్తుతం 99 శాతం డివైజ్లు ఇక్కడే తయారవుతున్నాయన్నారు. గత పదేండ్లలో దేశవ్యాప్తంగా విమానాశ్రయాల సంఖ్య రెండింతలు పెంచినట్లు, అలాగే రైల్వే కిలోమీటర్లను కూడా భారీగా పెంచినట్లు మంత్రి చెప్పారు.
20 లక్షల కోట్లకు మొబైల్ ఫోన్ల ఉత్పత్తి
మొబైల్ ఇండస్ట్రీ రూ.19.45 లక్షల కోట్లకు చేరుకోనున్నదని ఇండస్ట్రీ బాడీ ఐసీఈఏ గురువారం వెల్లడించింది. పదేండ్లలో 20 లక్షల కోట్లకు చేరుకుంటున్నదని అంచనావేయగా..దీంట్లో రూ.19,45,100 కోట్లకు చేరుకున్నదని తెలిపింది. సంఖ్యపరంగా చూస్తే 245 కోట్ల యూనిట్ల మొబైళ్లు ఉత్పత్తి అయ్యాయి. 2014-15లో రూ.18, 900 కోట్లుగా ఉన్న మొబైల్ ఫోన్ల ఉత్పత్తి 2023-24 నాటికి 2 వేల శాతం పెరిగి రూ. 4,10,000 కోట్లకు చేరుకున్నదని పేర్కొంది.