Mahindra XUV700 Record | మహీంద్రా అండ్ మహీంద్రా తాజా ఎస్యూవీ కారు ఎక్స్‌యూవీ700 సరికొత్త రికార్డు నమోదు చేసింది. గురువారం నాటికి లక్ష వాహనాల కోసం బుకింగ్స్ వచ్చాయి. గ్లోబల్ సప్లయ్ చైన్ సమస్యలు ఉన్నా జనవరి కల్లా 14 వేల యూనిట్ల డెలివరీ పూర్తి చేసింది. కస్టమర్లకు సకాలంలో కారు డెలివరీకి చర్యలు తీసుకుంటున్నామని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఉత్పత్తి వేగవంతం చేసినా అసాధారణ రీతిలో బుకింగ్స్ నమోదవుతున్నాయని వెల్లడించింది. ఫలితంగా ఎక్స్‌యూవీ 700 ఎస్యూవీ కారు బుక్ చేసుకున్న వారు 6-10 నెలలు వేచి ఉండాల్సి వస్తున్నది.
ఎక్స్‌యూవీ700లో ఏఎక్స్7 సిరీస్ కారు కోసం 12 నెలలకు పైగా వెయిట్ చేయాల్సి వస్తున్నట్లు మహీంద్రా పేర్కొంది. గత ఆగస్టులో ఎక్స్‌యూవీ700 కారును ఆవిష్కరించింది మహీంద్రా అండ్ మహీంద్రా. అక్టోబర్ ప్రారంభంలో బుకింగ్స్ మొదలయ్యాయి. అదే నెల 30 నుంచి కస్టమర్లకు డెలివరీ ప్రారంభించింది.
మహీంద్రా ఎక్స్‌యూవీ700 కారు ధర రూ.12.95 లక్షల నుంచి రూ.23.79 లక్షల మధ్య పలుకుతున్నది. ఐదు నుంచి ఏడు సీట్ల ఎక్స్‌యూవీ 700 మోడల్ కార్లు అందుబాటులో ఉన్నాయి. ఇవి రెండూ ఎంఎక్స్, ఏఎక్స్ (అడ్రెనోఎక్స్) బ్రాడ్ ట్రిమ్స్ మోడల్లో లభ్యం అవుతాయి. అడ్రెనోఎక్స్ మోడల్ కారు ఏఎక్స్3, ఏఎక్స్5, ఏఎక్స్7 అనే మూడు సబ్ ట్రిమ్స్‌లో అందుబాటులో ఉంది. అక్టోబర్ ఏడో తేదీ నుంచి బుకింగ్స్ మొదలైతే, ఇప్పటివరకు లక్ష కార్లు బుక్ అయ్యాయని మహీంద్రా వివరించింది.
భారత్‌లో ఎస్యూవీ మోడల్ కారుగా ఎక్స్‌యూవీ700 కోసం శరవేగంగా బుకింగ్స్ నమోదు కావడం ఒక మైలురాయి అని మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. 90 రోజుల్లోపు 14 వేల కార్ల డెలివరీ చేసింది. తొలిసారి కార్ల కొనుగోలుదారులను ఎక్కువగా ఎక్స్‌యూవీ 700 కారు ఆకర్షిస్తున్నది.