ముంబై, అక్టోబర్ 14: రానున్న నెలల్లో వడ్డీ రేట్ల పెంపు అంశమై రిజర్వ్‌బ్యాంక్ (ఆర్బీఐ) మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) సభ్యులు భిన్నాభిప్రాయాల్ని వ్యక్తం చేశారు. అయితే గత నెలలో 50 బేసిస్ పాయింట్ల రేటు పెంపునకు మాత్రం సభ్యులందరూ ఓటు చేశారు. సెప్టెంబర్ 30న జరిగిన ఆర్బీఐ ఎంపీసీ సమావేశపు మినిట్స్‌ను శుక్రవారం విడుదల చేశారు. ఆర్థిక వ్యవస్థకు సంబంధించి వెలువడే గణాంకాలు, ఎప్పటికప్పుడు మారే పరిస్థితులకు అనుగుణంగా ద్రవ్య విధానం ఉండాలని ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ మినిట్స్‌లో రాశారు. అయితే కేంద్ర ప్రభుత్వం నియమించిన ఇద్దరు స్వతంత్య్ర సభ్యులు అషిమా గోయల్, జయంత్ వర్మలు మాత్రం రానున్న రోజుల్లో రేట్ల పెంపు నిలిపివేతకు మొగ్గుచూపారు.
‘ఈ పెంపు తర్వాత విరామం తీసుకోవాల్సిన అవసరం ఉంది’ అంటూ మినిట్స్‌లో జయంత్ వర్మ రాశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో ద్రవ్యోల్బణం దిగివస్తుందంటూ ఆర్బీఐ అంచనాలు, నిపుణుల అంచనాలు వెల్లడవుతున్నాయని, వృద్ధి తగ్గుతుందన్న అంచనాలు ఉన్నాయని, ఈ నేపథ్యంలో పాలసీ రేటును సాధారణస్థాయికంటే అధికంగా పెంచడం ప్రమాదకరం కాగలదని వర్మ మినిట్స్‌లో హెచ్చరించారు. ద్రవ్యోల్బణ అంచనాల్ని కుదించేందుకు ముందస్తుగానే రేట్లు పెంచడం ముఖ్యమని ఆర్బీఐ మానిటరీ పాలసీకి ఇన్ఛార్జ్, డిప్యూటీ గవర్నర్ మైఖల్ పాత్రా రాశారు. ముందుస్తు పాలసీ చర్యలతో సరఫరాలకు తగ్గ డిమాండ్ ఉంటుందని, దీంతో ద్రవ్యోల్బణం ఒత్తిడులు తగ్గుతాయన్నారు. వివిధ దేశాల వడ్డీ రేట్ల మధ్య వ్యత్యాసం ద్వారా జరిగే క్యారీ ట్రేడ్‌తో లభించే ఫైనాన్స్ స్థిరమైనది కాదని, ఇతర దేశాల పాలసీ పొరపాట్ల నుంచి రక్షణ పొందే శక్తిని భారత్ ఆర్జించుకుందని అషిమా గోయల్ మినిట్స్‌లో రాశారు.