హైదరాబాద్, జూన్ 8(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి అమెరికాకు చెందిన ప్రముఖ విమానయాన సంస్థ డెల్టా ఎయిర్‌లైన్స్ సుముఖత వ్యక్తం చేసినట్లు రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. తెలంగాణకు పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యంగా శ్రీధర్ బాబు నేతృత్వంలో రాష్ట్ర బృందం అమెరికాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సందర్బంగా శనివారం మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి అట్లాంటాలోని డెల్టా ఎయిర్‌లైన్స్ ప్రధాన కార్యాలయంలో కంపెనీ వైస్ ప్రెసిడెంట్, సీటీవో నారాయణన్ కృష్ణకుమార్‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
హైదరాబాద్ నుంచి నేరుగా అట్లాంటాకు విమాన సర్వీసులు నడపడానికి డెల్టా ఎయిర్‌లైన్స్ సానుకూలంగా స్పందించిందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. ఇరు నగరాల మధ్య విమాన సర్వీసులు లేకపోవడంతో విద్యాభ్యాసం కోసం వచ్చే విద్యార్థులు, ఇతర ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురికావాల్సి వస్తున్నదన్నారు. దీనిపై కంపెనీ వర్గాలు సానుకూలంగా స్పందించాయి.