Milk To be Costlier | పిల్లలకు పౌష్టికాహారం పాలు.. పాల ఉత్పత్తులే. కానీ.. పాలు, పాల ఉత్పత్తుల ధరలను డెయిరీ సంస్థలు ఇటీవలే పెంచేశాయి. దేశంలో పెరిగిపోయిన పగటి ఉష్ణోగ్రతలతోపాటు పశుగ్రాసం ధర పైపైకి దూసుకెళ్లడంతో పాల సేకరణ ధరల పెరుగుదలకు కారణం అని భావిస్తున్నారు. పలు డెయిరీ కంపెనీలు పాలు, పాల ఉత్పత్తుల ధరలు 5-8 శాతం మధ్య పెంచేశాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థ భాగంలో మరికొన్ని కంపెనీలు పెంచనున్నాయని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ అనలిస్ట్స్ నివేదిక పేర్కొంది.
ప్రతిఏటా జూన్లో దేశమంతటా 5.8 శాతం పాల ధరలు పెరిగితే, దక్షిణ భారతంలో 3.4 శాతం పెరుగుతాయని ఈ నివేదిక వెల్లడించింది. కొవ్వు తొలగించిన పాల పొడి ధర గత 12 నెలలుగా నిరంతరం పెరుగుతూనే ఉన్నది. గత ఏడాది పాలపొడి ధర 26.3 శాతం.. జూన్లో మూడు శాతం పెరిగింది. పాల ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి చేయడానికి ఆకర్షణీయంగా ఉన్నా.. భారత పాల పరిశ్రమలో డిమాండ్, సరఫరా నిష్పత్తి దెబ్బ తింటుందని ఆ నివేదిక పేర్కొంది.
కనుక మున్ముందు పాల సేకరణ ధరలను వినియోగదారులపై మోపేందుకు డెయిరీ కంపెనీలు పాలు, పాల ఉత్పత్తుల ధరలు పెంచవచ్చు. డెయిరీ కంపెనీల లాభాలు 50-100 బేసిక్ పాయింట్లు సర్ధుబాటుకు గురి కావచ్చు. అధిక ధరలు ఉన్నా విక్రయాలు భారీగానే ఉంటాయని భావిస్తున్నారు. ఆదాయం కూడా బాగానే వస్తుందని తెలుస్తున్నది.