న్యూఢిల్లీ, జూన్ 23 : ఇజ్రాయెల్-ఇరాన్ సంఘర్షణ.. భారతీయ బాస్మతి బియ్యం ఎగుమతులకు బ్రేక్ వేసింది. దేశీయ రైస్ ఎగుమతుల్లో ఇరాన్ వాటానే 18-20 శాతంగా ఉంటున్నది. ఈ క్రమంలో ఆ దేశంలో నెలకొన్న పరిస్థితులు ఇక్కడి నుంచి అక్కడకు వెళ్లే బియ్యం సరఫరాకు ప్రధాన అడ్డంకిగా మారుతున్నాయిప్పుడు. దీంతో దేశంలోని వివిధ పోర్టుల్లోనే దాదాపు లక్ష టన్నుల బాస్మతి బియ్యం నిల్వలు ఆగిపోయాయని సోమవారం అఖిల భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం తెలియజేసింది.
ప్రస్తుత ప్రతికూల పరిస్థితుల నడుమ మార్కెట్లో బియ్యం ధరలు క్రమేణా క్షీణిస్తున్నట్టు అఖిల భారత బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు సతీశ్ గోయల్ అన్నారు. ఇప్పటికే కిలో రూ.4-5 తగ్గినట్టు పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ, ప్రాసెస్డ్ ఫుడ్ ఉత్పత్తుల ఎగుమతి అభివృద్ధి అథారిటీతో పనిచేస్తూ పరిస్థితుల్ని తెలుసుకుంటున్నామని తెలిపారు. ఇక ఈ సంక్షోభంపై చర్చించేందుకు కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పియూష్ గోయల్‌తో ఈ నెల 30న సమావేశం కానున్నామన్నారు.
ఇరాన్‌కు భారత్ నుంచి ఎగుమతి అవుతున్న బాస్మతి బియ్యంలో 30-35 శాతం హర్యానాలో పండించినవే. ముఖ్యంగా కర్నల్, కైథల్, సోనిపట్ బియ్యానికి విదేశాల్లో మండి డిమాండ్ ఉన్నది. దీంతో ఆగిన బియ్యం ఎగుమతులతో అక్కడి ఎగుమతిదారులకు చెల్లింపులు ఆలస్యమవుతున్నాయి. ఇప్పటికే ఇరాన్‌కు ఎగుమతి అయిన దాదాపు 2 లక్షల మెట్రిక్ టన్నుల బియ్యానికి సంబంధించి రూ.1,500-2,000 కోట్ల చెల్లింపులు ఈ ఉద్రిక్తతల వల్ల ఆగిపోయినట్టు హర్యానా బియ్యం ఎగుమతిదారుల సంఘం అధ్యక్షుడు సుశీల్ జైన్ తెలియజేశారు.
ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతలు గల్ఫ్ దేశాలకు సరకు రవాణా, అక్కడి డిమాండ్‌ను ప్రభావితం చేయవచ్చని భారతీయ ఎగుమతి సంస్థల సమాఖ్య (ఎఫ్ఐఈవో) ఒకింత ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘర్షణలు ఇలాగే కొనసాగితే భారతీయ ఎగుమతులు పడిపోవచ్చన్నది. అలాగే షిప్పింగ్ వ్యయం పెరుగుతుందని, రవాణా సమయం అధికమవుతుందని, బీమా ప్రీమియంలూ ఎక్కువగానే ఉంటాయని ఎఫ్ఐఈవో అధ్యక్షుడు ఎస్సీ రల్హన్ అభిప్రాయపడ్డారు.
తమపై జరుగుతున్న దాడులకు అడ్డుకట్ట వేసేందుకు ఇరాన్ హర్మూజ్ జలసంధిని మూసేస్తామని బెదిరిస్తున్నది. ఇదే జరిగితే భారత్‌లో పెట్రో ధరలు పైపైకే. దేశ చమురు అవసరాలకు దిగుమతులే ఆధారం. ఆ దిగుమతుల్లో సగానికిపైగా సౌదీ తదితర గల్ఫ్ దేశాలే దిక్కు. ఇవన్నీ కూడా హర్మూజ్ జలసంధి ద్వారానే భారత్‌కు చేరుతున్నాయి. కాగా, కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ ఇటీవలి వివరాల ప్రకారం దేశంలో ప్రస్తుతం సుమారు 74 రోజులకు సరిపడా చమురు నిల్వలున్నాయి. ఇండియన్ ఆయిల్ వద్ద 40-42 రోజులు.. భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం వద్ద 24 రోజులు.. భారతీయ వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్స్ లిమిటెడ్ వద్ద 9 రోజులకు సరిపడా ఉన్నాయి.
గుజరాత్‌లోని కండ్లా, ముంద్రా నౌకాశ్రయాల్లో ఎక్కువగా బియ్యం ఆగిపోయాయి. నౌకలు, షిప్పింగ్ ఇన్సూరెన్స్ రెండూ నిలిచిపోవడంతో బియ్యం ఎగుమతిదారులు ఇబ్బందులు పడుతున్నారు.
వాణిజ్యంపై ఇజ్రాయెల్-ఇరాన్ ఉద్రిక్తతలు ప్రభావం చూపుతున్నాయి. ఏటా దేశీయ బాస్మతి బియ్యం ఎగుమతుల్లో మూడింటా ఒక వంతు హర్యానా రాష్ట్రం నుంచే జరుగుతున్నాయి.