Microsoft Layoffs | ఆర్థిక మాంద్యం ముప్పు భయాలు ఇంకా టెక్ దిగ్గజ సంస్థలను వదల్లేదు. ప్రపంచంలోనే అగ్రశ్రేణి టెక్ జెయింట్ మైక్రోసాఫ్ట్ మూడో విడత లే-ఆఫ్లకు సిద్ధమైంది. ఈ దఫా స్లపయ్ చైన్, క్లౌడ్ (Cloud), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (Artificial Intelligence -AI), ఇంటర్నెట్ ఆఫ్ థింక్స్ ( Internet of Things-IoT) విభాగాల్లో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం పడనున్నది. ఈ ఏడాది ప్రారంభంలోనే 10 వేల మంది ఉద్యోగులను తొలగిస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. అందులో భాగంగానే మూడో దఫా ఉద్యోగుల ఉద్వాసనలు ఉంటాయని తెలుస్తున్నది. అయితే, ఎంత మందికి పింక్ స్లిప్‌లు ఇస్తారన్న సంగతి మాత్రం వెల్లడి కాలేదు.
వివిధ స్థాయిల్లో పని చేస్తున్న ఉద్యోగులు, టీమ్‌ల్లోని ఉద్యోగులను మైక్రోసాఫ్ట్ తొలగించనున్నట్లు సమాచారం. ఇటీవలే వాషింగ్టన్లో 689 మంది ఉద్యోగులకు పింక్ స్లిప్‌లు ఇచ్చింది. గత నెలలో వాషింగ్టన్లో 617 మందిని ఇంటికి సాగనంపింది. జనవరిలో ఉద్వాసన పలికి 878 మందితో మొత్తం వాషింగ్టన్ రాష్ట్రంలోనే 2184 మందిని తొలగించింది. కాలిఫోర్నియాలో గత నెలలో 108 మంది నిపుణులకు ఉద్వాసన పలికింది. మైక్రోసాఫ్ట్‌లో వివిధ ప్రాజెక్టుల్లో పని చేస్తున్న గ్రూప్‌లు, టీమ్‌లనే పూర్తిగా తొలగిస్తున్నట్లు తెలుస్తున్నది. కృత్రిమ మేధ (ఏఐ) చేపట్టిన ప్రాజెక్ట్ బొన్సాయ్ని సంస్థ మూసేస్తున్నదని ఓ మైక్రోసాఫ్ట్ ఉద్యోగి లింక్డ్ ఇన్‌లో రాసుకొచ్చాడు.
18 ఏండ్లకు పైగా పని చేసిన మరో ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్ తనతోపాటు మొత్తం గ్రూప్‌ను వైదొలగాలని ఆదేశించిందన్నారు. క్లౌడ్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ విభాగాల్లో భాగంగా ఉన్న సప్లయ్ చైన్ ఇంజినీరింగ్ టీమ్ ప్రొడక్ట్ మేనేజర్లకు ఆ ఉద్యోగి ప్రిన్సిపల్ ప్రొడక్ట్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నాడు. గత జనవరిలోనే భారీ ఉద్యోగాల కోతపై సంస్థ చైర్మన్ అండ్ సీఈవో సత్య నాదెళ్ల సంకేతాలిచ్చారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికం పూర్తయ్యే లోపు పది వేల ఉద్యోగాలను తొలగిస్తామని, అటుపై కంపెనీలో మార్పులు తీసుకొస్తామని సత్యనాదెళ్ల స్పష్టం చేశారు. ప్రస్తుతం మైక్రోసాఫ్ట్‌లో 2.20 లక్షల మందికి పైగా పని చేస్తున్నారు. సంస్థ మొత్తంలో ఉద్వాసనకు గురైన ఉద్యోగులు దాదాపు ఐదు శాతం మంది మాత్రమే ఉంటారని భావిస్తున్నారు.