MG Comet EV | పెట్రోల్, డీజిల్ ధరలతో పోలిస్తే విద్యుత్ వెహికల్స్‌తో ప్రయాణం చౌక.. పర్యావరణ పరిరక్షణకు ఎలక్ట్రిక్ వెహికల్స్ (ఈవీ)కు పెరుగుతున్న గిరాకీ.. దేశీయ ఈవీ కార్ల మార్కెట్లో టాటా మోటార్స్‌దే హవా.. ఆ హవాకు బ్రేక్లేసేందుకు వస్తోంది మొర్రిస్ గ్యారెజెస్ మోటార్ ఇండియా (ఎంజీ మోటార్ ఇండియా). ఇంతకుముందే ప్రకటించిన ఎలక్ట్రిక్ కారు `కొమెట్ ఈవీ`ని ఆవిష్కరించింది. ఇది ఎంట్రీ లెవల్ ఎలక్ట్రిక్.. బుల్లి కారు. మారుతి సుజుకి ఆల్టో కంటే చిన్న కారు. అత్యంత చౌక ధరకే అందుబాటులోకి వస్తుందని ఎంజీ మోటార్ పేర్కొంది. ఇప్పటికే గుజరాత్‌లోని హలోల్ ప్లాంట్‌లో ఉత్పత్తి ప్రారంభమైంది. టాటా మోటార్స్ `టియాగో ఈవీ`కి `కొమెట్ ఈవీ` గట్టి పోటీ ఇస్తుందని భావిస్తున్నారు.
ఎంజీ `కొమెంట్ ఈవీ` కారు ఐదు రంగుల ఆప్షన్లలో వస్తున్నది. క్యాండీ వైట్, ఆపిల్ గ్రీన్ విత్ బ్లాక్ రూఫ్, క్యాండీ వైట్ విత్ బ్లాక్ రూఫ్, అరోరా సిల్వర్, స్టార్రీ బ్లాక్ రంగుల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తున్నది. ఈ కారు ధర రూ.10 లక్షలు పలుకుతుందని అంచనా. టాటా టియాగో ఈవీ కారు ధర రూ.8.69 లక్షల నుంచి రూ.11.99 లక్షల మధ్య పలుకుతున్నది.
`ఎంజీ జడ్ఎస్ ఈవీ` తర్వాత భారత్ మార్కెట్లోకి వస్తున్న రెండో ఎంజీ మోటార్స్ స్మార్ట్ ఈవీ కారు ఇది. టాయ్బాయ్ డిజైన్‌తో వస్తున్న బుల్లి `కొమెంట్ ఈవీ`కి రెండు చిన్న డోర్లు ఉంటాయి. ముందు భాగంలో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, ఎంజీ లోగో, డే టైమ్ రన్నింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ టెయిల్ లైట్స్ @ రేర్, 12-అంగుళాల స్టీల్ వీల్స్ , క్రోమ్ డోర్ హ్యాండిల్స్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ కెమెరా తదితర ఆప్షన్లు ఉన్నాయి.
20.5 అంగుళాల ఇంటిగ్రేటెడ్ ఫ్లోటింగ్ వైడ్ స్క్రీన్ `ఇంటెలిజెంట్ టెక్ డాష్‌బోర్డ్` ఉంటుంది. 10.25-అంగుళాల హెడ్ యూనిట్, 10.25-అంగుళాల డిజిటల్ క్లస్టర్ ఉంటుంది. రోటరీ ఎయిర్ కండిషనింగ్ కంట్రోల్స్ విత్ క్రోమ్ హైలైట్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, కీలెస్ ఎంట్రీ, డ్రైవ్ మోడ్ తదితర ఫీచర్లు ఉంటాయని తెలుస్తున్నది. స్టీరింగ్ మౌంటెడ్ కంట్రోల్స్ విత్ ఇన్స్పైర్డ్ ఆపిల్ ఐ-పాడ్, ఆడియో, నేవిగేషన్, ఇన్ఫోటైన్మెంట్ వాయిస్ కమాండ్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయని సమాచారం. 25 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్, 38 బీహెచ్పీ కెపాసిటీ గల ఎలక్ట్రిక్ మోటార్ ఉంటాయని తెలుస్తున్నది.