న్యూయర్క్: మే 26: ఆన్లైన్ షాపింగ్ దిగ్గజం హాలీవుడ్లో అడుగుపెడుతోంది. ‘జేమ్స్‌బాండ్’ సినిమాలతో సహా ఎన్నో బ్లాక్బస్టర్లను నిర్మించిన ప్రముఖ హాలీవుడ్ స్టుడియో ఎంజీఎంను అమెజాన్ 845 కోట్ల డాలర్లకు (దాదాపు రూ. 61,000 కోట్లు) కొనుగోలుచేయనుంది. 2017లో కిరాణాచైన్ హోల్ఫుడ్స్ ను 1400 కోట్ల డాలర్లకు కొన్న అమెజాన్‌కు ఎంజీఎం రెండో అతిపెద్ద టేకోవర్. ఈ మేరకు ఒక ఒప్పందం కుదుర్చుకున్నట్లు గురువారం ఇరు కంపెనీలు ప్రకటించాయి. గర్జించే సింహం లోగో కలిగిన ఎంజీఎం హాలీవుడ్ సినిమాలు చూసేవారందరికీ సుపరిచితమే. ఆన్లైన్ స్ట్రీమింగ్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్‌తో పాటు మీడియా వ్యాపారాల్ని విలీనపరుస్తున్న డిస్నీ, ఏటీఅండ్‌టీ, డిస్కవరీలతో పోటీపడే ప్రణాళికలో భాగంగా అమెజాన్ తాజా డీల్‌కు తెరతీసింది. అమెజాన్‌కు ప్రస్తుతం వున్న ప్రైమ్వీడియో సర్వీసును ఎంతమంది వీక్షిస్తాన్నది కంపెనీ వెల్లడించనప్పటికీ, ఇందులో 20 కోట్లకుపైగా ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నారు. ఎంజీఎంను కొనడంతో అమెజాన్‌కు మరిన్ని చలనచిత్రాలు, టీవీ షోలు, రాకీ, రాబోకాప్, పింక్పాంథర్ వంటి క్యారక్టర్లు అందుబాటులోకి వస్తాయి.