Meta : ఐటీ సహా వివిధ రంగాల్లో ఉద్యోగాల కోత కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఫేస్ బుక్ మాతృసంస్థ ‘మెటా’ త్వరలోనే 1500 మంది సిబ్బందిని తొలగించనుంది. ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ‘మెటా’ గ్రూపునకు చెందిన రియాలిటీ ల్యాబ్స్ డివిజన్ అనే సంస్థ నుంచి పది శాతం సిబ్బందిని తొలగించనుంది.
ఈ కంపెనీలో దాదాపు 15,000 మంది సిబ్బంది పని చేస్తున్నారు. పది శాతం అంటే.. 1500 మంది వరకు సిబ్బందికి ఉద్వాసన పలకనుంది. ‘మెటా’ గ్రూపులోని వర్చువల్ అగ్యుమెంటెడ్ రియాలిటీ ఉత్పత్తుల తయారీని రియాలిటీ ల్యాబ్ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సంస్థ ఆక్యులస్, వీఆర్ హెడ్ సెట్ వంటి ఉత్పత్తుల్ని అందించింది. ప్రస్తుతం పలు రకాల హెడ్ సెట్స్, రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్, హారిజాన్ వరల్డ్స్ ప్లాట్ ఫాం వంటి ఉత్పత్తుల్ని అందిస్తోంది. ఇక.. ఉద్యోగుల తొలగింపునకు సంబంధించి ఇప్పటికే సంస్థ సీటీవో ఆండ్య్రూ బోస్వర్త్ కీలక ప్రకటన చేశారు. బుధవారం అందరు ఉద్యోగుల్ని మీటింగుకు పిలిచారు. ఇది ఈ ఏడాదిలోనే ముఖ్యమైన మీటింగ్ అని తెలిపారు.
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా, వ్యక్తిగతంగా హాజరుకావాలని కోరారు. ఈ మీటింగ్ తర్వాత ఉద్యోగుల తొలగింపుపై స్పష్టత రానుంది. మరోవైపు మెటా సంస్థలో మరికొన్ని కీలక మార్పుల చేసేందుకు సంస్థ అధినేత మార్క్ జుకర్ బర్గ్ సిద్ధమవుతున్నారు.