Mercedes Benz | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 9: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ దిగ్గజం మెర్సిడెస్ బెంజ్ సంచలనం సృష్టించింది. ఈ సంస్థ రూపొందించిన ఈక్యూఎస్ 580 4మ్యాటిక్ ఎలక్ట్రిక్ సెడాన్ కారు గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లోకెక్కింది. కేవలం ఒక్కసారి చార్జింగ్ చేస్తే ఏకంగా 949 కిలోమీటర్లు ప్రయాణించింది మరి. సింగిల్ చార్జ్‌తో ఇంత దూరం పరుగులుపెట్టిన బ్యాటరీ ఎలక్ట్రిక్ వెహికిల్ (బీఈవీ) ఇదేనని గిన్నిస్ బుక్ వర్గాలు తేల్చాయి. బెంగళూరు నుంచి దేవన్గెరె, హూబ్లీ, బెల్గావీ, కొల్హాపూర్, సతారా, పుణెల మీదుగా నవీ ముంబైకి చేరింది.
మార్గ మధ్యంలో భారీ వర్షాలు, ట్రాఫిక్, రోడ్డు పనులు, డైవర్షన్లున్నా ఎలాంటి సమస్యల్లేకుండా ప్రయాణం సాగినట్టు కంపెనీ పేర్కొన్నది. ప్రతీ 100 కిలోమీటర్లకు 11.36 కిలోవాట్ల విద్యుత్తు వినియోగం జరిగినట్టు స్పష్టం చేసింది. కాగా, మహారాష్ట్రలోని పుణె సమీపంలోగల చకాన్ ప్లాంట్‌లోనే ఈ కార్లు తయారవుతున్నాయి. హైదరాబాద్‌లో ఈ కారు ధర రూ.1.95 కోట్లుగా ఉన్నది. ఇక ఈ ‘మేడ్ ఇన్ ఇండియా’ ఈక్యూఎస్ సెడాన్ గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ టైటిల్‌ను గెల్చుకోవడంపట్ల మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ, సీఈవో సంతోష్ అయ్యర్ ఆనందం వ్యక్తం చేశారు. ఈ రికార్డును సాధించడం వెనకున్న ఆటోకార్ ఇండియా బృందానికి శుభాకాంక్షలు తెలిపారు.