హైదరాబాద్, జూలై 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్రం తోళ్ల పరిశ్రమకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నది. రాష్ట్రంలో గొర్రెలు, పశువుల సంఖ్య పెరిగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున 12 మినీ లెదర్ పార్క్‌లు, ఒక మెగా లెదర్ క్లస్టర్ ఏర్పాటు చేసేందుకు తెలంగాణ స్టేట్ లెదర్ ఇండస్ట్రీస్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్(టీఎస్ఎల్ఐపీసీఎల్) ప్రతిపాదనలు సిద్ధం చేసింది. అంతేకాదు, ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) పద్ధతిలో లెదర్ పార్క్‌ల అభివృద్ధి కోసం చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ (సీఎల్ఆర్ఐ)తో ఒప్పందాన్ని కుదుర్చుకున్నది.
పారిశ్రామికాభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం విభిన్న రంగాలపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తాజాగా తోళ్ల పరిశ్రమపై దృష్టి సారించింది. రాష్ట్రంలో ఇటీవల గొర్లు, పశుసంపద పెరగడం, మాంసం వినియోగం, ఉత్పత్తిలో గణనీయ ప్రగతి సాధించడంతో తోలు ఉత్పత్తి సైతం భారీగా పెరిగింది. దీంతో తోళ్ల పరిశ్రమను అభివృద్ధి చేయడం ద్వారా వివిధ తోలు ఉత్పత్తులు ఇక్కడే తయారు చేయాలని నిర్ణయించారు. పీపీపీ పద్ధతిలో ఈ ప్రాంతాల్లో మినీ లెదర్ పార్క్‌లు, అలాగే, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో 53 ఎకరాల్లో లెదర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ మినీ లెదర్ పార్క్‌లలో గూడ్స్, గార్మెంట్స్, హ్యాండీక్రాఫ్ట్స్, ఫర్నీచర్, ఫుట్‌వేర్ ఉత్పత్తి కానున్నాయి.
‘తెలంగాణ రాష్ట్రం లెదర్ ఇండస్ట్రీలో తిరుగులేని స్థాయికి ఎదిగే అవకాశాలు గణనీయంగా ఉన్నాయి. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా తొమ్మిది మినీ లెదర్ పార్క్‌లు, లెదర్ క్లస్టర్‌ను ఏర్పాటు చేసేందుకు చర్యలు ఉపక్రమించింది.
-శ్రీనివాస్ నాయక్, టీఎస్ఎల్ఐపీసీఎల్ ఎండీ