Hyundai Verna | దేశీయ ఆటోమొబైల్ మార్కెట్లో రోజురోజుకు ఎస్యూవీ కార్ల పాపులారిటీ పెరిగిపోతున్న వేళ.. సెడాన్ మోడల్ కార్లకు గిరాకీ తగ్గుతున్నది. ప్రస్తుతం దేశీయంగా అమ్ముడవుతున్న కార్లలో ఎస్‌యూవీల వాటా 50 శాతం పై మాటే. సెడాన్ కార్లు 10 శాతం లోపే అమ్ముడవుతున్నాయి. సెడాన్ కార్లలో కంపాక్ట్, మిడ్ సైజ్ మోడల్స్ ఎక్కువగా అమ్ముడయ్యాయి. ఈ ఏడాది జనవరి – మే మధ్య సెడాన్ కార్ల విక్రయాలు 25.91 శాతం తగ్గిపోయాయి. గతేడాది ఇదే సమయంలో 42,407 సెడాన్ కార్లు అమ్ముడైతే, ఈ ఏడాది 31,421 యూనిట్లకే పరిమితం అయ్యాయని సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటోమొబైల్ మాన్యుఫాక్చరర్స్ (సియామ్) చెబుతోంది.
మిడ్ సైజ్ సెడాన్ కార్లలో హ్యుండాయ్ వెర్నా, ఫోక్స్‌వ్యాగన్ విర్టస్, స్కోడా స్లావియా, హోండా సిటీ, మారుతి సుజుకి సియాజ్ లకు పాపులారిటీ ఉంది. వీటిల్లో సిక్త్ జనరేషన్ హ్యుండాయ్ వెర్నా అత్యధికంగా అమ్ముడవుతోంది. 2023 మార్చిలో మార్కెట్లోకి ఎంటరైన హ్యుండాయ్ వెర్నా కార్లు గత ఐదు నెలల్లో 8,250 యూనిట్లు అమ్ముడయ్యాయి. తర్వాతీ స్థానాల్లో ఫోక్స్‌వ్యాగన్ విర్టస్ 8,150, స్కోడా స్లావియా 6,419, హోండా సిటీ 5,301, మారుతి సుజుకి సియాజ్ 3,031 యూనిట్లు అమ్ముడు పోయాయి.
హ్యుండాయ్ వెర్నా కారు రూ.11 లక్షల నుంచి రూ.17.42 లక్షల వరకూ (ఎక్స్ షోరూమ్) పలుకుతోంది. ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది. 1.5 లీటర్ల ఎంపీఐ పెట్రోల్ (115 పీఎస్ విద్యుత్, 143.8 ఎన్ఎం టార్క్), 1.5 లీటర్ల టర్బో జీడీఐ పెట్రోల్ (160 పీఎస్ విద్యుత్, 253 ఎన్ఎం టార్క్) వెలువరిస్తుంది. ఎంపీఐ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, ఐవీటీ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్, టర్బో జీడీఐ మోడల్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్, 7-స్పీడ్ డీసీటీ ఆప్షన్లలో అందుబాటులో ఉంది.
హ్యుండాయ్ వెర్నా కారు డార్క్ క్రోమ్ పారామెట్రిక్ గ్రిల్లె, హరిజోన్ ఎల్ఈడీ పొజిషనింగ్ ల్యాంప్స్, ఎల్ఈడీ డీఆర్ఎల్స్, కనెక్టెడ్ పారా మెట్రిక్ ఎల్ఈడీ టెయిల్ ల్యాంప్స్, 16-అంగుళాల డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్, ఇంటీరియర్‌గా పవర్ డ్రైవర్ సీట్, ఫ్రంట్ హీటెడ్ అండ్ వెంటిలేటెడ్ సీట్స్, స్విచ్ఛబుల్ డిజిటల్ ప్యానెల్ ఫర్ ఇన్ఫోటైన్మెంట్ అండ్ క్లైమేట్ కంట్రోలర్. 10.25 అంగుళాల హెచ్డీ ఆడియో వీడియో నేవిగేషన్ సిస్టమ్, డిజిటల్ క్లస్టర్ విత్ కలర్డ్ టీఎఫ్టీ ఎంఐడీ, బోస్ ప్రీమియం సౌండ్ 8 స్పీకర్ సిస్టమ్, 64 అంబియెంట్ లైట్ సిస్టమ్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్ తదితర ఫీచర్లు ఉన్నాయి.