హైదరాబాద్, సెప్టెంబర్ 15 : సూపర్-స్పెషాల్టీ హెల్త్‌కేర్ సేవల సంస్థ మెడికవర్ హాస్పిటల్స్..హైదరాబాద్‌లో మరో 2 హాస్పిటల్స్‌ను ప్రారంభించబోతున్నది. రూ.100 కోట్లతో సికింద్రాబాద్‌లో ఏర్పాటు చేసిన దవాఖానను ఈ నెల 16న, రూ.150 కోట్లతో కోకాపేట వద్ద ఏర్పాటు చేస్తున్న హాస్పిటల్ ఈ ఏడాది చివరినాటికి అందుబాటులోకి రానున్నట్టు కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అనిల్ కృష్ణ తెలిపారు. దీంతో అదనంగా 800 పడకలు అందుబాటులోకి రానున్నాయన్నారు. ఈ పెట్టుబడులను అంతర్గత వనరుల ద్వారా, ఆర్థిక సేవల సంస్థల వద్ద రుణాలు తీసుకున్నట్టు చెప్పారు. వ్యాపార విస్తరణకు అవసరమైన నిధులను సేకరించడానికి వచ్చే ఏడాది ఐపీవోకి రానున్నట్టు ఆయన ప్రకటించారు. ఎంతమేర సేకరించేదానిపై ఆయన స్పష్టమైన సమాధానం ఇవ్వలేదు. మౌలిక సదుపాయాల కల్పనకోసం, రుణాలను తగ్గించుకోవడానికి ఐపీవో ద్వారా సేకరించిన నిధులను వినియోగించనున్నట్టు ఆయన ప్రకటించారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో రూ.1,850 కోట్లుగా నమోదైన టర్నోవర్, ఈసారి రూ.2 వేల కోట్లు అధిగమించనున్నదన్నారు. తెలంగాణతోపాటు ఏపీ, బెంగళూరు, పూణెలలో 23 హాస్పిటల్స్ ఉండగా, పడకల కెపాసిటీ 5,750 ఉన్నది.
ప్రస్తుతం మెట్రో నగరాల్లో దవాఖానాలను ఏర్పాటు చేసిన సంస్థ..సమీప భవిష్యత్తులో ద్విశీయ శ్రేణి నగరాలకు విస్తరించనున్నట్టు ఆయన ప్రకటించారు. ఇందుకోసం ఆయా నగరాల్లో చిన్న స్థాయి హాస్పిటల్స్‌ను కొనుగోలు చేసే ఆలోచన కూడా ఉన్నదని, ప్రస్తుతం ఈ విషయంపై ప్రధానంగా దృష్టి సారించినట్టు చెప్పారు. ఇదే క్రమంలో చందానగర్‌లో ఉన్న ఆసుపత్రి సామర్థ్యాన్ని మరో 150 పడకలు పెంచుతున్నట్టు తెలిపారు. హాస్పిటల్ రంగం పలు ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నదని, ముఖ్యంగా క్లినికల్ ప్రతిభ ఉన్నవారు చాలా తక్కువ స్థాయిలో ఉన్నారని, దీనికి తోడు హెల్త్‌కేర్ ఖర్చులు అధికం కావడం, అంతర్జాతీయ స్థాయిలో కరెన్సీలు తీవ్ర ఆటుపోటులకు గురికావడం, టారిఫ్‌లు, నూతన మెడికల్ టెక్నాలజీ పరికరాలకోసం అధికంగా నిధులు వెచ్చించాల్సి వస్తున్నదన్నారు.