Gold Price | ఈ వారంలో యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ప్రపంచ మార్కెట్లో బలమైన సంకేతాల నడుమ దేశీయ ఫ్యూచర్ మార్కెట్లో మంగళవారం బంగారం ధరలు మరోసారి స్వల్పంగా పెరిగాయి. రూ.119 పది గ్రాముల ధర రూ.1,10,298కి చేరుకున్నాయి. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో అక్టోబర్ డెలివరీకి సంబంధించిన బంగారం ఫ్యూచర్స్ కాంట్రాక్ట్ ధర 0.10 శాతం పెరిగింది. గత సెషన్లో పది గ్రాముల ధర రూ.1,10,330 రికార్డు స్థాయిని తాకిన విషయం తెలిసిందే. అలాగే, ఎంసీఎక్స్‌లో డిసెంబర్ కాంట్రాక్ట్ ధర రూ.109 పెరిగి పది గ్రాములకు రూ.1,11,346కి చేరుకుంది. సోమవారం రూ.1,11,350 వద్ద కొత్త గరిష్ట స్థాయికి చేరిన విషయం విధితమే. ఈ నెల 17న ఫెడ్ రిజర్వ్ వడ్డీ రేట్లపై పాలసీని ప్రకటించనున్నది.
ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించనుందని వ్యాపారులు ఆశిస్తున్నారు. ఇక అంతర్జాతీయ మార్కెట్లో డిసెంబర్ డెలివరీకి సంబంధించిన ఫ్యూచర్స్ గోల్డ్ ఔన్సుకు ఆల్ టైమ్ గరిష్ఠ స్థాయి 3,728.32 డాలర్లకు చేరుకున్నది. అమెరికా ద్రవ్య విధానంలో సడలింపులు, ప్రపంచ ఆర్థిక అనిశ్చితి మధ్య సురక్షితమైన ఆస్తులకు డిమాండ్ కొనసాగుతున్న నేపథ్యంలో ధరలు పెరుగుతున్నాయి. ఇటీవల వారాల్లో పెట్టుబడిదారులు బంగారంపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపించారని మార్కెట్ నిపుణులు పేర్కొన్నారు. దేశీయ, విదేశీ మార్కెట్లలో ధరలు అనేక రికార్డులను నెలకొల్పిందన్నారు. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు రూ.1,029 పెరిగి రూ.1,10,540కి చేరుకుందని ఇండియా బులియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ (IBJA) పేర్కొంది. వెండి కూడా కిలోకు రూ.1,198 పెరిగి రూ.1,28,989కి చేరుకుందని వివరించింది.