McKinsey Layoffs | రోజురోజుకు అందుబాటులోకి వస్తున్న అత్యాధునిక టెక్నాలజీతోపాటు ఆర్థిక రంగంలో అనిశ్చితి నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా పలు కంపెనీలు పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ క్రమంలో గ్లోబల్ మేనేజ్మెంట్ కన్సల్టెన్సీ సర్వీసెస్ సంస్థ ‘మెకెన్సీ (McKinsey)’ కీలక నిర్ణయం తీసుకున్నది. బ్రిటన్ లోని తన ఉద్యోగులను తొలగిస్తామని ప్రకటించిన మెకెన్సీ ఇచ్చిన ఆఫర్ అందరినీ ఆలోచింపజేస్తున్నది. అలా ఉద్వాసనకు గురైన వారికి తొమ్మిది నెలల వేతన పరిహార ప్యాకేజీ, తదుపరి ఉద్యోగాలకు కెరీర్ ట్రైనింగ్ అందిస్తామని ప్రకటించింది.
ప్రపంచ దేశాల్లో వివిధ రంగాల వ్యాపారాలు దెబ్బతినడంతో కన్సల్టెన్సీ సర్వీసులకు డిమాండ్ తగ్గింది. దీని ప్రభావంతో మెకెన్సీ అండ్ కంపెనీకి ఆర్డర్లు తగ్గిపోయాయి. తత్ఫలితంగా ఇతర కంపెనీల మాదిరే ఈ సంస్థ కూడా ఉద్యోగులను కుదించుకుంటున్నది. గతేడాది 1400 మందిని తొలగించిన మెకెన్సీ.. తాజాగా మరి కొంత మందికి ఉద్వాసన పలుకనున్నది. ఇతర కంపెనీల్లో వారు ఉద్యోగం పొందేందుకు తొమ్మిది నెలల గడువు ప్రకటించింది. ఈ సమయంలో కెరీర్ కోచింగ్ కోర్సులు, ఇతర వనరులు ఫ్రీగా వాడుకోవచ్చునని, అయితే, తొమ్మిది నెలల లోపు ఉద్యోగం రాకపోతే కంపెనీని వీడాల్సిందేనని తేల్చి చెప్పింది. గతేడాది 1400 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికిన మెకెన్సీ.. తాజాగా గత ఫిబ్రవరి నెలలో 3000 మందికి నోటీసులు ఇచ్చింది. మూడు నెలల్లో పని తీరు మెరుగు పర్చుకోవాలని లేదంటే ఉద్వాసన తప్పదని తేల్చి చెప్పింది.