Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఏడు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.67,859.77 కోట్లు పెరిగింది. ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్ భారీగా లబ్ధి పొందాయి. గతవారం బీఎస్ఈ ఇండెక్స్ సెన్సెక్స్ 598 పాయింట్లు (0.99శాతం) లాభంతో ముగిసింది. అంబేద్కర్ జయంతి సందర్భంగా శుక్రవారం (ఏప్రిల్ 14) దేశీయ స్టాక్ మార్కెట్లకు సెలవు. టాప్-10 సంస్థల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీ ఎయిర్టెల్ లాభ పడ్డాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఇన్ఫోసిస్ నష్టాలతో ముగిశాయి.
ఐసీఐసీఐ బ్యాంక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.17,188.25 కోట్లు పెరిగి రూ. 6,27,940.23 కోట్లకు పెరిగింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.15,065.31 కోట్లు వృద్ధి చెంది రూ.9,44,817.85 కోట్ల వద్ద స్థిర పడింది. హెచ్డీఎఫ్సీ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.10,557.84 కోట్లు లబ్ధి పొంది రూ.5,11,436.51 కోట్ల వద్ద ముగిసింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.10,190.97 కోట్లు లాభ పడి రూ.4,91,465.96 కోట్ల వద్ద నిలిచింది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.9,911.59 కోట్లు పెరిగి రూ.15,93,736.01 కోట్ల వద్ద స్థిరపడింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.4,640.8 కోట్ల వృద్ధితో రూ. 4,75,815.69 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.305.01 కోట్ల లబ్ధితో రూ.4,27,416.08 కోట్ల వద్దకు చేరుకున్నది.
మరోవైపు, ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.13,897.67 కోట్లు నష్టపోయి రూ.5,76,069.05 కోట్లతో సరిపెట్టుకున్నది. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.11,654.08 కోట్లు పతనమై రూ.11,67,182.50 కోట్లకు పరిమితమైంది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 6,954.79 కోట్లు కోల్పోయి రూ.5,95,386.43 కోట్ల వద్ద ముగిసింది.
గతేడాదితో పోలిస్తే దేశంలోనే అతిపెద్ద ఐటీ సర్వీసుల సంస్థ టీసీఎస్ మార్చి త్రైమాసికం నికర లాభాలు 14.8 శాతం వృద్ధి చెందాయి. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో టీసీఎస్ రూ.11,392 కోట్ల నికర లాభం గడించింది. మరో ఐటీ సంస్థ ఇన్ఫోసిస్ గురువారం మార్కెట్ అంచనాల కంటే తక్కువ గ్రోత్తో మార్చి త్రైమాసికం ఫలితాలు ప్రకటించింది. అమెరికా బ్యాంకింగ్ సెక్టార్లో సంక్షోభంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సర రెవెన్యూ గైడెన్స్ 4-7 శాతమే ఉంటుందని అంచనా వేసింది.
గత వారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత రిలయన్స్.. టాప్-10లో మొదటిస్థానంలో కొనసాగింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, హిందూస్థాన్ యూనీ లివర్, ఇన్పోసిస్, హెచ్డీఎఫ్సీ, ఐటీసీ, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), భారతీ ఎయిర్టెల్ నిలిచాయి.