Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈలోని టాప్-10 సంస్థల్లో ఆరు సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 1.71,680.42 కోట్లు ఆవిరైంది. ఐటీ దిగ్గజాలు ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) భారీగా నష్టపోయాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 759.58 పాయింట్లు (0.98శాతం), ఎన్ఎస్ఈ-50 సూచీ నిప్టీ 228.3 పాయింట్లు (0.97 శాతం) నష్టంతో ముగిశాయి. బీఎస్ఈ-10 సంస్థల్లో ఇన్ఫోసిస్, టాటా కన్సల్టెన్సీ సర్వీసె (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్), ఐటీసీ సంస్థల మార్కెట్ క్యాపిటలైజేషన్ పతనమైంది. మరోవైపు రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీ ఎయిర్టెల్, స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) లాభ పడ్డాయి.
ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.62,948.4 కోట్ల నుంచి రూ.7,53,678.38 కోట్లకు పతనమైంది. ఇన్ఫోసిస్ డిసెంబర్ త్రైమాసికం ఆర్థిక ఫలితాలు వెల్లడించిన తర్వాత శుక్రవారం ట్రేడింగ్లో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు ప్రాధాన్యం ఇవ్వడంతో ఇన్ఫోసిస్ షేర్లు దాదాపు ఆరు శాతం నష్టపోయాయి. టీసీఎస్ ఎం-క్యాప్ రూ.50,598.95 కోట్లు పతనమై రూ.14,92,714.37 కోట్లకు చేరుకుంది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) ఎం-క్యాప్ రూ.20,605.92 కోట్లు కోల్పోయి రూ.5,53,152.52 కోట్లతో సరిపెట్టుకున్నది.
ఐసీఐసీఐ బ్యాంకు మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.16,005.84 కోట్ల నష్టంతో రూ.8,65,495.17 కోట్లకు పడిపోయింది. హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఎం-క్యాప్ రూ.15,640.8 కోట్ల నష్టంతో రూ.12,51,799.81 కోట్లకు చేరుకుంది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.5,880.51 కోట్లు కోల్పోయి రూ.5,50,702.93 కోట్లకు పరిమితమైంది.
మరోవైపు, రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.79,773.34 కోట్ల వృద్ధితో రూ.17,60,967.69 కోట్లకు పెరిగింది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.18,697.08 కోట్లు పుంజుకుని రూ.6,81,930.22 కోట్లకు చేరుకుంది. భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఎం-క్యాప్ రూ.9,993.5 కోట్లు పెరిగి రూ.5,40,724.05 కోట్ల వద్ద స్థిర పడింది. భారతీ ఎయిర్టెల్ ఎం-క్యాప్ రూ.7,080.98 కోట్లు పెరిగి రూ. 9,27,014.97 కోట్లకు చేరింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్ అతిపెద్ద సంస్థగా నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంకు, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంకు, ఇన్ఫోసిస్, భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ), హెచ్యూఎల్, ఐటీసీ, ఎల్ఐసీ నిలిచాయి.