Market Capitalisation | గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లలో ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో ఐదు సంస్థలు తమ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.2,23,660 కోట్లు నష్టపోయాయి. వాటిల్లో రిలయన్స్ ఇండస్ట్రీస్, భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ) ఉన్నాయి. గతవారం బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1,475.96 (1.99 శాతం) నష్టపోయింది.రిలయన్స్ ఇండస్ట్రీస్, ఐసీఐసీఐ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ), భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ), హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) భారీగా నష్టపోగా, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), హెచ్డీఎఫ్సీ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, ఇన్ఫోసిస్, ఐటీసీ లబ్ధి పొందాయి.
రిలయన్స్ ఇండస్ట్రీస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.81,763.35 కోట్లు నష్టపోయి రూ.19,19,595.15 కోట్లకు చేరుకున్నది. ఎల్ఐసీ ఎం-క్యాప్ రూ.63,629.48 కోట్లు కోల్పోయి రూ.5,84,967.41 కోట్లకు పరిమితమైంది. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) ఎం-క్యాప్ రూ.50,111.7 కోట్ల పతనంతో రూ.6,53,281.59 కోట్ల వద్ద స్థిర పడింది. హిందూస్థాన్ యూనీ లివర్ (హెచ్యూఎల్) మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.21,792.46 కోట్ల పతనంతో రూ.5,46,961.35 కోట్ల వద్ద నిలిచింది. ఐసీఐసీఐ బ్యాంక్ ఎం-క్యాప్ రరూ.6,363.11 కోట్ల నష్టంతో రూ.7,57,218.19 కోట్లకు పరిమితమైంది.
టీసీఎస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.38,858.26 కోట్ల లబ్ధితో రూ.15,25,928.41 కోట్ల వద్ద ముగిసింది. భారతీ ఎయిర్ టెల్ ఎం-క్యాప్ రూ.11,976.74 కోట్లు పుంజుకుని రూ.6,89,425.18 కోట్ల వద్ద స్థిర పడింది. ఐటీసీ ఎం-క్యాప్ రూ.7,738.51 కోట్ల లాభంతో రూ.5,23,660.08 కోట్లకు చేరుకున్నది. ఇన్ఫోసిస్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.7,450.22 కోట్లు పెరిగి రూ.6,78,571.56 కోట్ల వద్ద ముగిసింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఎం-క్యాప్ రూ.4,443.9 కోట్లు పెరిగి రూ.11,03,151.78 కోట్ల వద్ద స్థిర పడింది.
గతవారం ట్రేడింగ్ ముగిసిన తర్వాత టాప్-10 సంస్థల్లో రిలయన్స్ మొదటి స్థానంలో నిలిచింది. తర్వాతీ స్థానాల్లో టీసీఎస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసీ, హిందూస్థాన్ యూనీ లివర్, ఐటీసీ నిలిచాయి.