Maruti Suzuki |ప్రముఖ కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి త్వరలో ఎలక్ట్రిక్ మిడ్ సైజ్ ఎస్యూవీ కారు ఈవీఎక్స్ (eVX) కారును ఆవిష్కరించేందుకు సిద్ధమవుతున్నది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా సుమారు 25 వేల ఈవీ చార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందిస్తున్నది. ఇందుకోసం దేశవ్యాప్తంగా 2300 నగరాల్లోని 5100 పై చిలుకు సర్వీస్ సెంటర్ల నెట్ వర్క్ కలిగి ఉంది మారుతి సుజుకి. చార్జింగ్ మౌలిక వసతుల కల్పనకు కేంద్ర చమురు సంస్థలు, ఇంధన సంస్థలతో చర్చలు జరుపుతోంది మారుతి సుజుకి.
కర్బన ఉద్గారాల రహిత ఎకో సిస్టమ్ ఏర్పాటుకు.. ఎలక్ట్రిక్ వాహనాల దిశగా మొబిలిటీ వ్యవస్థ పరివర్తనకు ప్రధాన సవాల్ గా నిలిచింది చార్జింగ్ వసతుల కల్పన. ఈ నేపథ్యంలో తన డీలర్ వర్క్ షాప్ ల వద్ద చార్జింగ్ పాయింట్లు ఏర్పాటు చేసేందుకు గల అవకాశాలపై మారుతి సుజుకి అధ్యయనం జరుపుతోంది. ప్రతి సర్వీస్ సెంటర్ పరిధిలో రెండు చార్జింగ్ స్టేషన్ల కోసం ఒక బే ఏర్పాటు చేయాలని మారుతి సుజుకి ప్రణాళిక రూపొందిస్తోంది. ఈ మేరకు బెంగళూరులోని సర్వీసు మెకానిక్కులకు ఈ విషయమై శిక్షణ అందిస్తోంది.
కేంద్ర చమురు సంస్థల సర్వీస్ స్టేషన్ల (పెట్రోల్ బంకుల) వద్ద ఈవీ చార్జింగ్ కోసం స్పేస్ రిజర్వ్ చేయాలని మారుతి సుజుకి కోరిందని ఆయా సంస్థల వర్గాలు తెలిపాయి. ఇక త్వరలో ఆవిష్కరించనున్న ఈవీ మిడ్ సైజ్ ఎస్ యూవీ ‘ఈవీఎక్స్ (eVX)’ కారు ధర రూ.20-25 లక్షల మధ్య ఉంటుందని భావిస్తున్నారు. తొలి మూడు నెలల్లో మూడు వేల కార్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.