
Maruti Big Plan | కరోనా తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి.. కార్లలో ప్రయాణానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. కోవిడ్ వేళ దెబ్బతిన్నా.. తర్వాత కోలుకుంటున్న రంగాల్లో ఆటోమొబైల్ ఒకటి. కరోనా ఎప్పటికప్పుడు రూపు మార్చుకుని కొత్త వేరియంట్ల రూపంలో దాడి చేస్తుండటంతో కార్ల మార్కెట్ మున్ముందు పుంజుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో కస్టమర్లను ఆకట్టుకునేలా అధునాతన మోడల్ కార్లు రాబోతున్నాయి. ఆ దిశగా దేశంలోనే అతిపెద్ద కార్ల సంస్థ మారుతి సుజుకి మరో బిగ్ ప్లాన్ సిద్ధం చేసింది. మధ్య తరగతి ప్రజల మనస్సు దోచేందుకు సరికొత్త ఎస్యూవీ కార్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది.
వచ్చే మూడేండ్లలో ఆరు విస్తృత శ్రేణి ఎస్యూవీ కార్లను విపణిలో విడుదల చేయనున్నది మారుతి సుజుకి. తద్వారా మార్కెట్లో తన వాటా పెంచుకునేందుకు వ్యూహాలు రూపొందిస్తున్నట్లు మీడియాలో వార్తలొచ్చాయి. న్యూ మిడ్ సైజ్డ్ ఎస్యూవీ కార్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. 4.4 మీటర్ల పొడవు గల కార్లు మారుతి సుజుకి విపణిలోకి రాబోతున్నాయి. కొన్ని కార్లకు ఫేస్‌లిఫ్ట్ చేయడంతో.. కొత్త కార్లను ఈ ఏడాదిలో ఆవిష్కరించబోతున్నది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో న్యూ మిడ్ సైజ్డ్ ఎస్యూవీ అండ్ న్యూ జిమ్నీ లైఫ్‌స్టైల్ ఎస్యూవీ కారును మారుతి ఆవిష్కరించనున్నది. టయోటా జాయింట్ వెంచర్‌తో కలిసి ఈ కారును డిజైన్ చేస్తున్నది. టయోటా డైహట్సు న్యూ జనరేషన్ ఆర్కిటెక్చర్ (డీఎన్జీఏ) ప్లాట్‌ఫామ్‌పై దీన్ని అభివృద్ధి చేస్తారు. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్తో న్యూ మిడ్ సైజ్డ్ ఎస్యూవీ అండ్ న్యూ జిమ్నీ లైఫ్ స్టైల్ పోటీ పడబోతున్నది.
తన స్విఫ్ట్ స్పోర్ట్ మోడల్ కారుకు 1.4 లీటర్ల టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజిన్ జత చేస్తారు. న్యూ జిమ్నీతోపాటు స్విఫ్ట్ మోడల్ కార్లు మాన్యువల్, ఆటోమేటిక్ గేర్ బాక్స్ ఆప్షన్లు కలిగి ఉన్నాయి. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో న్యూ విటారా బ్రెజా మోడల్ కారును ఆవిష్కరించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఇంకా హ్యుండాయ్ అల్కాజర్, టాటా సఫారీ మోడల్ కార్లకు పోటీగా ఏడు సీట్ల ఎస్‌యూవీని తీసుకొచ్చేందుకు సన్నద్ధమవుతున్నది. ఇంకా టాటా పంచ్‌కు ప్రత్యామ్నాయంగా సబ్ కంపాక్ట్ ఎస్యూవీ కారును ఆవిష్కరించేందుకు సిద్ధమైందని ఇంతకుముందే వార్తలొచ్చాయి.
ప్రయాణికుల కార్ల సెగ్మెంట్లో గత నెలలో మారుతి సుజుకి వాటా 44.7 శాతానికి పడిపోయింది. న్యూ మోడల్ కార్లు ఆవిష్కరించకపోవడంతోపాటు కరోనా వేళ సెమీ కండక్టర్ల కొరత దీనికి కారణాలని తెలుస్తున్నది. స్కోడా ఆటో ఈ ఏడాది ఆరు కొత్త కార్లను ఆవిష్కరించేందుకు సిద్ధమైంది. ఇప్పటికే కియా కారెన్స్‌ను విపణిలో ఆవిష్కరించగా, మహీంద్రా అండ్ మహీంద్రా తన స్కార్కియోకు మార్పులతో మార్కెట్లోకి తేనున్నది. టాటా మోటార్స్, హ్యుండాయ్, బీఎండబ్ల్యూ కూడా తమ ప్రణాళికలకు పదును బెడుతున్నాయి.