Maruti Suzuk | న్యూఢిల్లీ, ఆగస్టు 24: కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ స్పీడ్ పెంచింది. ఇప్పటికే పలు మాడళ్లను దేశీయంగా విక్రయిస్తున్న సంస్థ..వచ్చే ఏడాది కాలంలో మరో ఐదు మాడళ్లను విడుదల చేయడానికి సిద్ధమైంది. ఈ కార్లు రూ.10 లక్షల లోపు ఉండవచ్చునని అంచనా. వచ్చే మూడు నుంచి నాలుగేండ్లలో ఎనిమిది సరికొత్త మాడళ్లను విడుదల చేయనున్నట్లు ప్రకటించిన సంస్థ..వచ్చే ఏడాదిలోగానే దీంట్లో సగం అందుబాటులోకి తీసుకురాబోతుండటం విశేషం. దీంతోపాటు ఉత్పత్తి, ఎగుమతులను సైతం పెంచుకోవడానికి ప్రణాళికలను వేగవంతం చేస్తున్నది. వచ్చే ఏడాదిలోగా విడుదల చేయనున్న కార్లలతో పెట్రోల్, సీఎన్జీ, హైబ్రిడ్ మాడళ్లు ఉన్నాయి. విడుదల చేయనున్న మాడళ్ల వివరాలు..
సరికొత్త డిజైర్
ఈ ఏడాది పండుగ సీజన్ నాటికి నయా డిజైర్ కారును అందుబాటులోకి తీసుకురాబోతున్నది. డిజైనింగ్, ఫీచర్స్, ప్లాట్‌ఫాం, ఇంజిన్ అన్ని రకాలు నూతన స్విఫ్ట్ మాడల్గానే ఉండనున్నాయి. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్‌తో తయారుకానున్న ఈ మాడల్ అధిక మైలేజీ ఇవ్వనున్నది.
తొలి ఈవీ కారు
వచ్చే రెండు నుంచి మూడేండ్లలో తన తొలి ఈవీ కారును దేశీయ మార్కెట్‌కు పరిచయం చేయబోతున్నది మారుతి. 3.4 మీటర్ల పొడువు కలిగిన ఈ కారు సింగిల్ చార్జింగ్‌తో 230 కిలోమీటర్ల వరకు ప్రయాణించనున్నదని అంచనా. ఈ కారు 2026-27 వరకు అందుబాటులోకి రానున్నది.
నయా బాలెనో
నయా బాలెనో అందుబాటులోకి తీసుకురాబోతున్నది సంస్థ. 1.2 లీటర్, 3- సిలిండర్ పెట్రోల్ ఇంజిన్, హైబ్రిడ్ టెక్నాలజీతో రూపొందించిన ఈ మాడల్ లీటర్‌కు 35 కిలోమీటర్ల వరకు మైలేజీ ఇవ్వనున్నది. 2026లో ఈ మాడల్‌ను తీసుకొచ్చే ఉద్దేశంలో సంస్థ ఉన్నది.