Maruti Suzuki | న్యూఢిల్లీ, మే 5 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీకి గట్టి షాక్ తగిలింది. దేశీయ ప్యాసింజర్ కార్ల మార్కెట్లో అగ్రస్థాయిలో దూసుకుపోయిన కంపెనీకి బ్రేక్‌లు పడ్డాయి. సంస్థకు మహీంద్రా అండ్ మహీంద్రా, హ్యుందాయ్ మోటర్ల నుంచి పోటీ తీవ్రతరమవుతుండటంతో కంపెనీ మార్కెట్ వాటా ఏటేటా పడిపోతున్నది. ఇదే క్రమంలో గత నెలలో 40 శాతం దిగువకు పడిపోయిందని దేశీయ ఆటోమొబైల్ తయారీదారుల సంఘం(ఫాడా) విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. రెండో స్థానానికి మహీంద్రా ఎగబాకింది. ఈ స్థానంలో ఉన్న హ్యుందాయ్ 12.47 శాతం మార్కెట్ వాటాతో నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నది.
అలాగే టాటా మోటర్స్ 12.59 శాతం మార్కెట్‌తో మూడో స్థానంలో కొనసాగుతున్నది. గడిచిన నెలలో దేశీయంగా 3,49,939 యూనిట్ల ప్యాసింజర్ వాహనాలు అమ్ముడయ్యాయి. అంతక్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన 3,44,594 యూనిట్లతో పోలిస్తే 1.55 శాతం అధికం. వీటిలో మారుతి సుజుకీ 1,38,021 యూనిట్ల పీవీలను విక్రయించింది. ఏప్రిల్ నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా 48,405 యూనిట్ల వాహనాలను విక్రయించింది. కంపెనీకి చెందిన ఎస్‌యూవీలకు మార్కెట్లో డిమాండ్ అధికంగా ఉండటంతో 13.83 శాతం వాటాను దక్కించుకున్నది. అలాగే హ్యుందాయ్ మోటర్ 43,642 యూనిట్ల వాహనాలను విక్రయించి నాలుగో స్థానంతో సరిపెట్టుకున్నది.