న్యూఢిల్లీ, ఏప్రిల్ 1: మార్చి నెలకు వివిధ ఆటోమొబైల్ కంపెనీల అమ్మకాలు మిశ్రమంగా ఉన్నాయి. మారుతి సుజుకి, హ్యుందాయ్ మోటర్స్ మార్చిలో డీలర్లకు జరిపిన సరఫరాలు తగ్గగా, టాటా మోటార్స్, కియా మోటర్స్, స్కోడా హోల్ సేల్ అమ్మకాల్లో కొత్త రికార్డును నెలకొల్పాయి. గత ఐదేండ్లలో ఎన్నడూ లేనంతగా డీలర్లకు వాహనాల్ని సరఫరా చేశామని టొయోటా కిర్లోస్కర్ మోటర్ వెల్లడించింది. అలాగే మార్చి నెలలో మహీంద్రా అండ్ మహీంద్రా పాసింజర్ వాహన హోల్సేల్ విక్రయాలు జోరుగా పెరిగాయి. స్కోడా రెండు దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా అమ్మకాలు జరిపింది. మార్చి నెలలో విక్రయాలు తగ్గడానికి సెమికండక్టర్ చిప్స్ కొరత కారణమని మారుతి, హ్యుందాయ్, ఎంజీ మోటర్స్, నిస్సాన్లు పేర్కొన్నాయి. చిప్స్ కొరతతో 2022-23 పూర్తి ఆర్థిక సంవత్సరంలోనూ ఉత్పత్తి తగ్గవచ్చని మారుతి సూచనాప్రాయంగా వెల్లడించింది. మరో వైపు అమ్మకాల్ని భారీగా పెంచుకున్న టాటా మోటర్స్ తన ఫర్ఎవర్ శ్రేణి వాహనాలకు భారీ డిమాండ్ ఇందుకు కారణమని తెలిపింది. ఇటీవల తాము విడుదల చేసిన కారెన్స్ మోడల్ వినియోగదారుల్ని ఆకట్టుకోవడంతో అమ్మకాలు పెంచుకున్నట్టు కియా పేర్కొంది.