Maruti Suzuki | మారుతి సుజుకి కార్ల ధరలు పిరం కానున్నాయి. దాదాపు అన్ని మోడల్ కార్ల ధరలు 1.1 శాతం పెంచుతున్నట్లు మారుతి సుజుకి సోమవారం ప్రకటించింది. తక్షణం పెరిగిన ధరలు అమల్లోకి వస్తాయని రెగ్యులేటరీ ఫైలింగ్‌లో మారుతి సుజుకి తెలిపింది.గతేడాది ఏప్రిల్‌లో ధరలు పెంచిన తర్వాత ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇది రెండోసారి.
జనవరిలో కార్ల ధరలు పెంచుతామని గత నెలలోనే మారుతి సుజుకి వెల్లడించింది. 2023 నుంచి కర్బన ఉద్గారాల నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు కేంద్రం ప్రకటించింది. దీంతో కార్ల తయారీ ఖర్చు పెరుగనున్నది. ఎంట్రీ లెవల్ ఆల్టో నుంచి ఎస్యూవీ గ్రాండ్ విటారా వరకు కార్ల ధరలు రూ.3.39 లక్షల నుంచి రూ.19.49 లక్షల మధ్య ఉంటాయని తెలిపింది.
అన్ని కార్ల ధరలు 1.1 శాతం పెరుగుతాయని మారుతి సుజుకి ప్రకటించినా.. వేరియంట్, మోడల్స్‌ను బట్టి ధరలు మారతాయి. ఆయా కార్ల మోడల్స్ ధరలు ఎంత పెరుగుతాయన్నది వెల్లడించలేదు. ఇన్పుట్ కాస్ట్ పెరగడంతో ధరలు పెంచక తప్పడం లేదని మారుతి సుజుకి తెలిపింది.
అధికారికంగా వెల్లడించకున్నా ఢిల్లీ ఎక్స్ షోరూమ్ ధర ప్రకారం ఆల్టో బేస్ మోడల్ కారుపై రూ.3,729, బేస్ మోడల్ ఎర్టిగాపై రూ.9,251 పెరగనున్నది. వ్యాగన్-ఆర్ కారు ధర రూ.5,989, స్విఫ్ట్ రూ.6,510, బాలెనోపై రూ.7,139 పెరుగనున్నదని తెలుస్తున్నది.