న్యూఢిల్లీ, జనవరి 6: కార్ల తయారీలో అగ్రగామి సంస్థ మారుతి సుజుకీ కొనుగోలుదారులకు శుభవార్తను అందించింది. ఒకవైపు ధరలు పెంచుతూనే మరోవైపు ఎంపిక చేసిన మాడళ్లపై ప్రత్యేక రాయితీలను ప్రకటించింది. నూతన సంవత్సరంలో నెక్సా షోరూంలో పలు మాడళ్లను కొనుగోలు చేసిన వారికి రూ.2.5 లక్షల వరకు రాయితీ పొందవచ్చునని సూచించింది. ప్రీమియం వాహనాలను విక్రయించడానికి ఈ ప్రత్యేక షోరూంలను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. వీటిలో ఫ్రాంక్స్, బాలెనో, జిమ్నీ, విటారా మాడళ్లు ఉన్నాయి. వీటి వివరాలు..
ప్రీమియం మల్టీపర్పస్ వాహనమైన ఎక్స్ఎల్6ని రూ.50 వేల వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నది. దీంట్లో స్క్రాపింగ్ బోనస్ కింద రూ.25 వేలు, ఎక్సేంజ్ బోనస్ కింద రూ.20 వేలు ఇస్తున్నది. ఈ ఆఫర్లు పెట్రోల్, సీఎన్జీ మాడళ్లకు మాత్రమే వర్తించనున్నదని, డీజిల్ వాహనానికి వర్తించని స్పష్టంచేసింది.
బాలెనో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి సంస్థ ఏకంగా ఈ వాహనంపై రూ.90 వేల వరకు డిస్కౌంట్ కల్పిస్తున్నది. దీంట్లో కన్జ్యూమర్ డిస్కౌంట్ కింద రూ.40 వేలు, ఇతర రాయితీల కింద మరో రూ.20 వేలు అందిస్తున్నది. అలాగే ఎక్సేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, స్క్రాపింగ్ బోనస్ కింద రూ.20 వేలు ఇస్తున్నది.
ఇగ్నిస్ మాడల్పై రూ.75 వేల వరకు డిస్కౌంట్ ఇస్తున్నది. దీంట్లో కన్జ్యూమర్ డిస్కౌంట్ కింద రూ.45 వేలు, ఎక్సేంజ్ బోనస్ కింద రూ.15 వేలు, స్క్రాపింగ్ బోనస్ కింద రూ.30 వేలు, కార్పొరేట్ రాయితీ కింద మరో రూ.2,100 రాయితీ ఇస్తున్నది.
గ్రాండ్ విటారాపై రూ.1.18 లక్షల వరకు డిస్కౌంట్ కల్పిస్తున్నది సంస్థ. దీంట్లో కన్జ్యూమర్ డిస్కౌంట్ కింద రూ.65 వేలు, స్క్రాపింగ్ బోనస్ కింద రూ.50 వేలు, కార్పొరేట్ బోనస్ కింద మరో రూ.3,100 ఇస్తున్నది.
జిమ్నీ మాడల్పై రూ.1.9 లక్షల వరకు తగ్గింపు ధరతో మారుతి విక్రయిస్తున్నది.
మారుతి మాడళ్లలో అత్యధికంగా ఇన్విక్టో మాడల్పై రూ. 2.15 లక్షల వరకు రాయితీ ఇస్తున్నది. దీంట్లో ఎక్సేంజ్ బోనస్ కింద లక్ష రూపాయలు డిస్కౌంట్ కల్పించిన సంస్థ..స్క్రాపింగ్ బోనస్ కింద మరో లక్ష రూపాయలు రాయితీ కల్పిస్తున్నది.