Maruti Fronx CNG | దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ఇటీవలే మార్కెట్లో ఆవిష్కరించిన న్యూ కంపాక్ట్ ఎస్యూవీ ఫ్రాంక్స్ (New Compact SUV Fronx) సీఎన్జీ వర్షన్ మార్కెట్లో ఆవిష్కరించింది. దీని ధర రూ.8.41 లక్షలు (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. సిగ్మా వేరియంట్ రూ.8.41 లక్షలు పలుకుతుండగా, డెల్టా వేరియంట్ రూ.9.27 లక్షలకు లభిస్తుంది. మారుతి సుజుకి నుంచి మార్కెట్లోకి వచ్చిన 15వ సీఎన్జీ కారు. ఇప్పటి వరకు ఆల్టో, ఆల్టో కే10, ఎస్-ప్రెస్సో, సెలెరియో, ఎకో, వ్యాగన్-ఆర్, స్విఫ్ట్, డిజైర్, ఎర్టిగా, బాలెనో, బ్రెజా, ఎక్స్ఎల్6, గ్రాండ్ విటారా, టూర్ ఎస్ మోడల్ కార్లు సీఎన్జీ వేరియంట్లో అందుబాటులో ఉన్నాయి.
ఫ్రాంక్స్ సీఎన్జీ కారు 1.2 లీటర్ల డ్యుయల్-జెట్ డ్యుయల్-వీవీటీ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉంటుంది. పెట్రోల్ మోడ్ ఇంజిన్ గరిష్టంగా 89.73 పీఎస్ విద్యుత్, 113 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. సీఎన్జీ వేరియంట్ 77.5 పీఎస్, 98.5 ఎన్ఎం టార్చి వెలువరిస్తుంది. ఈ కారు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంటుంది.
కిలో సీఎన్జీపై ఫ్రాంక్స్ సీఎన్జీ వేరియంట్ 28.51 కి.మీ మైలేజీ ఇస్తుంది. ఇప్పటి వరకు మార్కెట్లో ఉన్న సీఎన్జీ వేరియంట్ కార్ల కంటే అధిక మైలేజీ ఇస్తుంది. ఫ్రాంక్స్ సీఎన్జీ వేరియంట్ సిగ్మా, డెల్టా ఆప్షన్లలో లభిస్తుంది. 2010 నుంచి ఇప్పటి వరకు 14 లక్షల సీఎన్జీ కార్లను విక్రయించింది. మొత్తం మారుతి సుజుకి కార్ల మార్కెట్లో సీఎన్జీ వేరియంట్ల వాటా 26 శాతం పై మాటే.