Maruti eVX EV SUV | దేశంలోనే పేరెన్నికగన్న కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి.. తొలిసారి మార్కెట్లోకి ఎలక్ట్రిక్ కారు తీసుకురానున్నది. ప్రతి ఒక్కరూ మోజు పెంచుకున్న స్పోర్ట్స్ యుటిలిటీ వెహికల్ (ఎస్యూవీ) కేటగిరీలో ఈవీ కారు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2023-24) చివరిలోగా ఆవిష్కరిస్తున్నట్లు తెలిపింది. ఆటో ఎక్స్ పో-2023లో ఈవీఎక్స్ ఎలక్ట్రిక్ ఎస్యూవీ (eVX electric SUV) కాన్సెప్ట్ ఆవిష్కరించింది. ఇదే మోడల్ కారు ప్రయోగాత్మకంగా పోలండ్‌లోని క్రాకోలో పరీక్షిస్తుండగా బయటపడింది. మారుతి సుజుకి మాతృసంస్థ సుజుకి మోటార్ కార్పొరేషన్ (ఎస్ఎంసీ) ప్రపంచవ్యాప్తంగా ఆవిష్కరించనున్న తొలి గ్లోబల్ వ్యూహాత్మక ఎలక్ట్రిక్ మోడల్ కానున్నదని తెలుస్తున్నది.
‘గ్రోత్ స్ట్రాటర్జీ ఫర్ 2029-30 నాటికి ఆరు ఎలక్ట్రిక్ కార్లు ఆవిష్కరిస్తామని ఎస్ఎంసీ గత జనవరిలో ప్రకటించిన సంగతి తెలిసిందే. 2029-30 ఆర్థిక సంవత్సరం నాటికి ఈవీల వాటా 15 శాతం ఉంటుందని, హైబ్రాడ్ మోడల్ 25 శాతం, ఇంటర్నల్ కంబుస్టన్ ఇంజిన్ (ఐసీఈ) మోడల్ కార్లు 60 శాతం ఉంటాయని మారుతి సుజుకి అంచనా వేస్తున్నది.
సింగిల్ చార్జింగ్‌తో ఈవీఎక్స్ (eVX) కారు 550 కి.మీ. దూరం ప్రయాణించగల సామర్థ్యం కలిగి ఉంటుంది. సేఫ్టీ బ్యాటరీ టెక్నాలజీతో 60 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ కూడా ఉంటుంది.దేశీయంగా ఎలక్ట్రిక్ కార్లు, వాటికి అవసరమైన బ్యాటరీల తయారీకి రూ.10 వేల కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టేందుకు గతేడాది మార్చిలో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వంతో ఎస్ఎంసీ అవగాహనా ఒప్పందం కుదుర్చుకున్నది.