Brezza CNG | దేశంలోనే అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి ( Maruti Suzuki).. ఇటీవల టాటా మోటార్స్, హ్యుండాయ్, మహీంద్రా అండ్ మహీంద్రా, కియా మోటార్స్ నుంచి గట్టి పోటీనెదుర్కొంటున్నది మారుతి సుజుకి. ఎలక్ట్రిక్ వెహికల్స్ విషయంలో టాటా మోటార్స్, ఎస్‌యూవీలు ఇతర పేరొందిన మోడల్ కార్ల క్యాటగిరీలో హ్యుండాయ్, కియా, మహీంద్రా నుంచి మారుతి సుజుకికి టఫ్ కాంపిటీషన్ నడుస్తోంది. దీన్ని అధిగమించేందుకు మారుతి సుజుకి తాను ఇప్పటికే తీసుకొచ్చిన కార్లను అప్డేట్ చేస్తూ కస్టమర్లకు అందిస్తున్నది. అందులో భాగంగానే పాపులర్ మోడల్ బ్రెజా సీఎన్జీ ( Brezza CNG ) వర్షన్ కారును కస్టమర్లకు పరిచయం చేసేందుకు రంగం సిద్ధమైంది.
వచ్చేనెల ప్రారంభంలో భారత మార్కెట్లోకి బ్రెజా సీఎన్జీ వస్తున్నది. మారుతి సుజుకి విడుదల చేస్తున్న 11వ సీఎన్జీ వర్షన్ కారు ఇది. ఈ సబ్-కంపాక్ట్ ఎస్యూవీ ( Sub-Compact SUV) మోడల్ డిజైన్లు, ఫీచర్లు.. మార్కెట్లో ఆవిష్కరణకు ముందే లీక్ అయ్యాయి. ఇప్పటికే మార్కెట్లో ఉన్న రెనాల్ట్ కిగర్, నిస్సాన్ మాగ్నైట్, మహీంద్రా ఎక్స్‌యూవీ 300, టాటా నెక్సన్, హ్యుండాయ్ వెన్యూ వంటి మోడల్ కార్లకు టఫ్ ఫైట్ ఇవ్వనున్నదీ బ్రెజా సీఎన్జీ.
2016లో మార్కెట్లోకి వచ్చిన మారుతి సుజుకి బ్రెజా ఎస్యూవీ డీజిల్.. 2020 నుంచి డీజిల్ వర్షన్తోనూ వినియోగదారులకు అందుబాటులో ఉంది. రెండు ఫ్యూయల్ ఆప్షన్లలో లభిస్తుంది. తాజాగా లీకైన డేటా ప్రకారం సీఎన్జీ బేస్డ్ ఎస్యూవీ ఆటోమేటిక్ వేరియంట్లోనూ లభ్యం అవుతుంది. అదే జరిగితే దేశంలోనే ఏకైక సీఎస్జీ ఆటోమేటిక్ కారుగా బ్రెజా సీఎన్జీ ( Brezza CNG ) నిలువనున్నది. గతేడాది ఆగస్టులోనే సీఎన్జీ వర్షన్ బ్రెజా కారు ఆవిష్కరిస్తున్నట్లు మారుతి సుజుకి ప్రకటించింది.
బ్రెజా సీఎస్టీ ( Brezza CNG ) వేరియంట్ నాలుగు ట్రిమ్స్‌ల్లో ఎల్ఎక్స్ఐ, వీఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ, జడ్ఎక్స్ఐ+ ( LXi, VXi, ZXi, ZXi+) ల్లో అందుబాటులో ఉంటుందని తెలుస్తున్నది. ఎంట్రీ లెవల్ ఎల్ఎక్స్ఐ ( LXi ) వేరియంట్ మినహా మిగతా వేరియంట్లన్నీ 6-స్పీడ్ టార్చ్ కన్వర్టర్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ కలిగి ఉంటాయి.
ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం గత జూన్‌లోనే భారత కస్టమర్లకు మారుతి సుజుకి తన బ్రెజా సీఎన్జీ వేరియంట్‌ను పరిచయం చేయాలని భావించింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల కొన్ని నెలలు వాయిదా పడినట్లు తెలుస్తున్నది. తాజాగా లీక్ అయిన సమాచారం ప్రకారం కొన్ని రోజుల్లోనే కొత్త కారు మార్కెట్లోకి రానున్నదని వినికిడి.
పెట్రోల్ వెర్షన్‌తో పోలిస్తే సీఎన్జీ వర్షన్ బ్రెజా కారు తక్కువ ఔట్పుట్తో వస్తుందని భావిస్తున్నారు. మారుతి సుజుకి ఎర్టిగ సీఎన్జీ ( Ertiga CNG) వేరియంట్ కారు 1.5లీటర్ల పెట్రోల్ ఇంజిన్‌తోపాటు గరిష్టంగా 87 బీహెచ్పీ పవర్, 121 ఎన్ఎం టార్చిని వెలువరిస్తుందని సమాచారం. బ్రెజా సీఎన్జీ వేరియంట్లో ఫీచర్లు కూడా దాదాపు అదే స్థాయిలో ఉంటాయని మారుతి సుజుకి వర్గాల కథనం. త్వరలో అధికారికంగా సీఎన్జీ బ్రెజా ఫీచర్లు వెల్లడయ్యే అవకాశం లేకపోలేదు.
ఇప్పటికైతే బ్రెజా సీఎన్జీ వర్షన్ కారు ధర ఎంత అన్న సంగతి వెల్లడి కాలేదు. కానీ మార్కెట్ వర్గాల అంచనా ప్రకారం దాదాపు రూ.7.99 లక్షల నుంచి రూ.13.96 లక్షల మధ్య బ్రెజా సీఎన్జీ ధర ఖరారు కావచ్చునని తెలుస్తున్నది. పెట్రోల్ వేరియంట్‌తో పోలిస్తే సీఎన్జీ కారు రూ.75 వేలు ఎక్కువగా ఉండొచ్చునని అంచనా.