Maruti Suzuki | కార్ల మార్కెట్లో తన స్థానాన్ని కాపాడుకునేందుకు మారుతి సుజుకి ఆపసోపాలు పడుతున్నది. హ్యుండాయ్, టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా నుంచి గట్టి పోటీ ఎదురవుతుండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎస్యూవీ కార్ల సేల్స్ రెట్టింపు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది. శరవేగంగా పెరుగుతున్న కార్ల సెగ్మెంట్లో ఎస్యూవీ కార్లు 25 శాతం పైమాటే అని కంపెనీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు. గత ఆర్థిక సంవత్సరంలో మారుతి సుజుకి 2.02 లక్షల ఎస్యూవీ కార్లు విక్రయించింది. ఇది మొత్తం దేశవ్యాప్తంగా కార్ల సేల్స్ మార్కెట్లో దాదాపు 13 శాతం. అయితే, 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు ఐదు లక్షల ఎస్యూవీ కార్లు విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్నది.
దేశంలో శరవేగంగా పెరిగిపోతున్న కార్ల విక్రయాల్లో ఎస్యూవీ సెగ్మెంట్ మాత్రమే. 2018లో 24 శాతంగా ఉన్న ఎస్యూవీ కార్ల సేల్స్ 2022 నాటికి 43 శాతానికి పెరగడం ఆసక్తికర పరిణామం. దేశీయ కార్ల పరిశ్రమలో 50 శాతం వాటాను తిరిగి పొందడానికి ఎస్యూవీ సెగ్మెంట్ దోహద పడుతుందని శశాంక్ శ్రీవాత్సవ పేర్కొన్నారు. ప్రసుతత ఆర్థిక సంవత్సరంలో ఎస్యూవీ కార్లలో తమ కంపెనీ వాటా 25 శాతానికి పెరుగుతుందని అంచనా వేస్తున్నామని తెలిపారు. ఈ ఏడాది సుమారు 19 లక్షల ఎస్యూవీ కార్లు అమ్ముడయ్యే అవకాశం ఉందని పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో శశాంక్ శ్రీవాత్సవ చెప్పారు.
ఎస్యూవీ కార్ల సెగ్మెంట్లో మారుతి సుజుకి బ్రెజా.. ఎంట్రీ లెవల్ ఎస్యూవీ కారుగా ఉంది. అంతే కాదు.. ఎంట్రీ లెవెల్ ఎస్యూవీ కార్ల సేల్స్‌లో బ్రెజా అగ్రస్థానంలో కొనసాగుతున్నది. గతేడాది మార్కెట్లోకి తెచ్చిన గ్రాండ్ విటారా సేల్స్ కూడా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో మొత్తం కార్ల విక్రయాలపై ప్రభావం చూపుతుందని శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఫ్రాంక్స్తోపాటు జిమ్మీ మోడల్ కార్ల సేల్స్ కూడా మార్కెట్లో మారుతి సుజుకి కార్ల వాటా పెరుగుదలకు దారి తీస్తుందన్నారు.