Dec21 Auto Sales | డిసెంబర్ నెల కార్ల విక్రయాల్లో దేశీయ ఆటోమొబైల్ దిగ్గజాలు టాటా మోటార్స్, మహీంద్రా అండ్ మహీంద్రా వృద్ధి నమోదు చేశాయి. తద్భిన్నంగా ఇప్పటివరకు ప్యాసింజర్ వెహికల్ మార్కెట్ లీడర్లుగా ఉన్న మారుతి సుజుకి, హ్యుండాయ్ మోటార్స్ ఇండియా సేల్స్ తగ్గుముఖం పట్టాయి. కార్ల ఉత్పత్తిపై సెమీ కండక్టర్ల కొరత ప్రతికూల ప్రభావం కొనసాగుతున్నది. నిస్సాన్, స్కోడా కార్ల సేల్స్ పెరిగితే హోండా కార్స్ సేల్స్ పడిపోయాయి.
దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి సేల్స్ డిసెంబర్లో నాలుగు శాతం పడిపోయాయి. 2020 డిసెంబర్లో 1,60,226 యూనిట్లు విక్రయించిన మారుతి 2021లో 1,53,149 యూనిట్లకు పరిమితమైంది. దేశీయ సేల్స్ 13 శాతానికి పతనం అయ్యాయి. 2020లో 1,50,288 కార్లు విక్రయించిన మారుతి.. 2021లో 1,30,869 యూనిట్లు మాత్రమే విక్రయించింది. ఎలక్ట్రానిక్ కాంపొనెంట్స్ కొరత కార్ల ఉత్పత్తిపై స్వల్ప ప్రభావం చూపిందని మారుతి సుజుకి ఓ ప్రకటనలో తెలిపింది. దేశీయంగా ఉత్పత్తి తగ్గడం వల్లే సేల్స్ తగ్గాయని వెల్లడించింది.
మారుతి మినీ కార్స్ ఆల్టో, ఎస్-ప్రెస్సో సేల్స్ 35 శాతం తగ్గిపోయాయి. 2020లో 24,927 యూనిట్లు విక్రయించగా, గత నెలలో 16,320 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. కంపాక్ట్ సెగ్మెంట్లోని స్విఫ్ట్, సెలెరియో, ఇగ్నిస్, బాలెనో, డిజైర్ మోడల్ కార్ల సేల్స్ 11 శాతం తగ్గాయి. 2020 డిసెంబర్లో 77,641 యూనిట్లు విక్రయిస్తే, గత నెలలో 69,345 యూనిట్లతో సరిపెట్టుకుంది. యుటిలిటీ వేరియంట్లు విటారా బ్రెజా, ఎస్ క్రాస్, ఎర్టిగా మోడల్స్ 25,701 నుంచి 26,982 (5%) యూనిట్లకు పెరిగాయి.
దేశీయ కార్ల విక్రయాల్లో రెండో స్థానంలో ఉన్న హ్యుండాయ్ మోటార్స్ సేల్స్ 26.6 శాతం పడిపోయాయి. 2020 డిసెంబర్లో 66,750 యూనిట్లు అమ్ముడైతే, గత నెలలో 48,933 యూనిట్లకు పరిమితమైంది. దేశీయ విక్రయాల్లో 31.8 శాతం తగ్గాయి. 2020 డిసెంబర్లో 47,400 కార్లు విక్రయించిన హ్యుండాయ్.. గత నెలలో 32,312 యూనిట్లతో సరిపెట్టుకుంది. 2020లో 5,22,542 యూనిట్లు పంపిణీ చేయగా, గత నెలలో 6,35,413 కార్లు డిస్పాచ్ చేసింది.
మారుతి, హ్యుండాయ్కి భిన్నంగా దేశీయ ఆటో మేజర్ టాటా మోటార్స్ ప్యాసింజర్ కార్ల విక్రయాల్లో 50 శాతం పురోగతి సాధించింది. 2020 డిసెంబర్లో 23,545 కార్లు విక్రయిస్తే, గత నెలలో 35,299 యూనిట్లు అమ్ముడయ్యాయి. మరో దేశీయ ఆటో దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా 10 శాతం సేల్స్ పెంచుకున్నది. 2020 డిసెంబర్లో 16,182 కార్లు విక్రయిస్తే, గత నెలలో 17,722 కార్లు అమ్ముడయ్యాయి.
నిస్సాన్ మోటార్స్ రెండు రెట్లు ఎక్కువగా కార్లు విక్రయించింది. 2020 డిసెంబర్లో 1159 కార్లు విక్రయిస్తే ..గత నెలలో 3010 కార్లు అమ్ముడయ్యాయి. స్కోడా ఆటో ఇండియా కూడా 2020 డిసెంబర్లో 1303 కార్లు విక్రయిస్తే, గత నెలలో 3234 యూనిట్ల కార్లు అమ్ముడయ్యాయి. హోండా కార్స్ సేల్స్ 8 శాతం తగ్గాయి. 2020 డిసెంబర్లో 8,638 కార్లు అమ్ముడు కాగా, గత నెలలో 7,973 యూనిట్లకు పరిమితమైంది.