హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): జీవ ఎరువుల వినియోగాన్ని ప్రోత్సహించేందుకు గానూ మార్కెఫెడ్ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే బయో ఫర్టిలైజర్ను అందుబాటులోకి తీసుకువచ్చేందుకు చర్యలను వేగవంతం చేసింది. ‘మార్క్ఫెడ్ గోల్డ్’ పేరుతో వచ్చే నెలలో ఈ బయో ఫర్టిలైజర్ను విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. 40 కిలోల బ్యాగ్ ధరను రూ. 700గా నిర్ణయించింది. వరి, మొక్కజొన్న, పత్తితో పాటు ఉద్యాన పంటలకు కూడా వినియోగించేలా దీన్ని తయారు చేశారు.
నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం రాంపూర్ గ్రామంలో విశ్వ ఆగ్రోటెక్ ఆధ్వర్యంలో ప్లాంట్ను నిర్మించి దీనిని తయారు చేస్తున్నారు. భూమిలో సేంద్రీయ కర్భనాన్ని పెంచే విధంగా, నేలను సారవంతం చేసి పంటలకు ఉపయోగపడే సూక్ష్మజీవుల సంఖ్యను పెంచే విధంగా ఇందులో ప్రత్యేక మిశ్రమాలను వినియోగించినట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. ఈ బయో ఫర్టిలైజర్ను వినియోగించడం వల్ల పంటలకు క్రిమికీటకాలు కూడా సోకవని, తద్వారా క్రిమి సంహారక మందులు పిచికారి చేయ్యాల్సిన అవసరం ఉండబోదని తెలిపారు. దీంతో రైతులకు పెట్టుబడి ఖర్చు భారీగా తగ్గనుంది.