న్యూఢిల్లీ, మార్చి 10: చిన్న, మధ్యతరహా సంస్థ (ఎస్ఎంఈ)లకు మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ షాకిచ్చింది. ఇనీషియల్ పబ్లిక్ ఆఫర్ (ఐపీవో) నిబంధనల్ని కఠినతరం చేసింది. దీంతో స్టాక్ మార్కెట్లలోకి పబ్లిక్ ఇష్యూల ద్వారా ప్రవేశించి నిధులను సేకరించాలన్న ఎస్ఎంఈల ఆశలపై నీళ్లు చల్లినైట్టెంది. ఆఫర్-ఫర్-సేల్ (ఓఎఫ్ఎస్)పై 20 శాతం పరిమితిని, కనీస లాభాలు ఉండాలన్న తదితర నిబంధనల్ని సెబీ తీసుకొచ్చింది.
ఐపీవోకు ముందు చివరి మూడు ఆర్థిక సంవత్సరాల్లో కనీసం రెండింట్లో కోటి రూపాయలకుపైగా నిర్వహణ లాభాల (ఈబీఐటీడీఏ)ను చూపాలన్నది. మదుపరుల ప్రయోజనార్థమే ఈ నిర్ణయాలు తీసుకున్నట్టు సెబీ వివరించింది. మొత్తం ఐపీవోలో ఓఎఫ్ఎస్ ద్వారా వాటాదారులకు అమ్మాలనుకున్న వాటాలు 20 శాతాన్ని మించరాదని కూడా స్పష్టం చేసింది.
అలాగే వాటాలను అమ్ముకొనే భాగస్వాములు ప్రస్తుతం తమకున్న వాటాల్లో 50 శాతాన్ని మించి అమ్మరాదని కూడా ఓ నోటిఫికేషన్లో తేల్చిచెప్పింది. స్టాక్ మార్కెట్లు రికార్డు స్థాయి లాభాల్లో కదలాడటంతో గడిచిన రెండేండ్లు పెద్ద ఎత్తున ఎస్ఎంఈలు ఐపీవోలను తీసుకొచ్చాయి. గత ఏడాది దాదాపు 240 పబ్లిక్ ఇష్యూల ద్వారా రూ.8,700 కోట్లకుపైగా నిధులను సమీకరించాయి. 2023లో రూ.4,686 కోట్లే.