ముంబై, జూన్ 24 : దేశీయ స్టాక్ మార్కెట్లు కోలుకున్నాయి. క్రూడాయిల్ ధరలు నాలుగు నెలల కనిష్ఠ స్థాయికి పడిపోవడం, బ్యాంకింగ్, ఆర్థిక, ఐటీ రంగ షేర్లకు మదుపర్ల నుంచి లభించిన మద్దతుతో సూచీలు ఒక్క శాతం వరకు లాభపడ్డాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందం కుదిరే అవకాశం ఉండటం, విదేశీ పెట్టుబడిదారులు భారీగా నిధులు చొప్పించడంతో సూచీలు భారీగా పుంజుకున్నాయని దలాల్‌స్ట్రీట్ వర్గాలు వెల్లడించాయి. ఇంట్రాడేలో వెయ్యి పాయింట్ల వరకు లాభపడిన 30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ చివరకు మార్కెట్ ముగిసే సమయానికి 790.54 పాయింట్లు లేదా 1.04 శాతం అందుకొని 76,991.22 పాయింట్లకు చేరుకున్నది.
మరో సూచీ ఎన్ఎస్ఈ నిఫ్టీ 197.55 పాయింట్లు అందుకొని 24,021.65 వద్ద స్థిరపడింది. ఆసియా మార్కెట్ల నుంచి వచ్చిన సానుకూల అంశాలకు తోడు ఇంధన ధరలు తగ్గుముఖం పట్టడంతో దేశీయ మార్కెట్లు కదంతొక్కాయని జియోజిట్ ఇన్వెస్ట్మెంట్స్ లిమిటెడ్ రీసర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు. సూచీల్లో ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ట్రెంట్, టెక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, ఐసీఐసీఐ బ్యాంక్, ఇన్ఫోసిస్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టీసీఎస్ షేర్లు లాభాల్లో ముగియగా..ఎన్టీపీసీ, టాటాస్టీల్, మారుతి, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు నష్టపోయాయి. రంగాలవారీగా ప్రైవేట్ బ్యాంకింగ్ సూచీ 2.21 శాతం లాభపడగా..రియల్టీ 2.17 శాతం, సర్వీసెస్ 2.14 శాతం, ఐటీ 1.81 శాతం, బ్యాంకింగ్ 1.78 శాతం, ఫోకస్డ్ ఐటీ 1.68 శాతం చొప్పున బలపడ్డాయి.